రాజకీయ నేతలు సంయమనం పాటించాలి

నిబంధనలు అతికిస్తే కఠిన చర్యలు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, జూన్‌ ఒకటి తర్వాత ఎగ్జిట్‌ ఫలితాలు, 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని రాజవొమ్మంగి సీఐ సన్యాసినాయుడు సూచించారు. ఆదివారం రాజవొమ్మంగి సర్కిల్‌ కార్యక్రమంలో మండలంలోని అన్నీ రాజకీయపార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌తోపాటు సిఆర్‌పిసి సెక్షన్‌ 144 అమలులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి అల్లర్లు, గొడవలకు తావులేకుండా ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. కౌంటింగ్‌ తర్వాత విజయోత్సవ సమావేశాలు, ర్యాలీలు నిషేధమన్నారు. గ్రామాల్లో ఎవరైనా అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు ఎస్‌ వెంకయ్య, రఘునాథరావు,పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.

చింతూరు : వచ్చేనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేవిధంగా ప్రతిఒక్కరూ సహకరించాలని సిఐ గజేంద్ర కుమార్‌ సూచించారు .ఆదివారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఫలితాలు విడుదలైన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు నిర్వహణ, బాణసంచా పేల్చడం, హింసాత్మక, కవ్వింపు చర్యలకు పాల్పడడం, బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నిబంధనలు అతికిస్తే కఠిన చర్యలు

రంపచోడవరం : ఎన్నికల కోడ్‌, సిఆర్‌పిసి సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వాటి ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండాలని ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ సూచించారు. నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండడం, అనుమతులు లేకుండా, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా కాల్పడం నిషేధమన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం, సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులను పెట్టి ప్రచారం చేయటం నేరమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీస్‌ వారికి సహకరించాలని ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కోరారు.

రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న సీఐ సన్యాసినాయుడు.

➡️