5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

May 2,2024 23:04

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి, సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌పై పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో అధికారులతో గురువారం సమీక్షించారు. 5న పీఓ, ఏపీఓ, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్‌లకు, 6న పోలీస్‌ సిబ్బందికి, 7న డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసే 33 శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు సదుపాయం కల్పించామని చెప్పారు. నిర్ణయించిన తేదీల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఉంటుందన్నారు. నియోజకవర్గాల్లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు హెల్ప్‌డెస్క్‌లు ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏర్పాటు చేస్తారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలట్‌లకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్‌లలో అన్నీ వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా.. పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలోని జెడ్‌పి పాఠశాల, చిలకలూరిపేటకు గణపవరం జెడ్‌పి పాఠశాలలో, నరసరావుపేటకు ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజి, సత్తెనపల్లి జెడ్‌పి బాలికల పాఠశాల, వినుకొండ లయోలా స్కూల్‌, గురజాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మాచర్లలో రైల్వే గేటు వద్ద గల జెడ్‌పి బాలికల పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ఉంటుందన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్‌ 19 పాజిటివ్‌ పేషంట్లు వారు కోరుకోన్నచోట వారి ఇంటి వద్దనే వారి ఓటును వేయుటకు ప్రత్యేక పోలింగ్‌ టీములు ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకు బృందాలను పంపుతామని చెప్పారు. వారందరికీ బిఎల్వోల ద్వారా ఫారం 12డి అందజేసి, హోం ఓటింగుకు సమ్మతి తెల్పిన వారినుండి 8,9 తేదీల్లో హోం ఓటింగ్‌ బృందాల ద్వారా ఇంటి వద్ద ఓటు వేయించుకొని స్వీకరిస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 714 మంది 85 ఏళ్ల పైబడినవారు, 636 మంది వికలాంగులు, మొత్తంగా 1350 మంది హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. హోం ఓటింగ్‌ ప్రక్రియ 7, 8, 9 తేదీల్లో ఉంటుందన్నారు. 7వ తేదీకి ముందు రోజు ఎన్నికల సిబ్బంది హోం ఓటింగ్‌ వినియోగించుకునే వారికి ముందస్తు సమాచారాన్ని ఇస్తామని, ఆర్మీ ఇతర మిలటరీ సర్వీసుల్లో పనిచేసే సర్వీస్‌ ఓటర్లకు ఇటిపిబిఎస్‌ ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామని అన్నారు. వీరికి ఇటిపిబిఎస్‌ పోర్టల్‌ ద్వారా పోస్టల్‌ బ్యాలట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా వారికి పంపి వారినుండి పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ను స్వీకరిస్తామని వివరించారు. పల్నాడు జిల్లాలో 1304 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు.

➡️