ఖరీఫ్‌కు సన్నద్ధత

May 24,2024 21:44

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలో ఖరీఫ్‌-2024 సీజన్‌కు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసినట్టు మండల వ్యవసాయాధికారి కె.తిరుపతిరావు తెలిపారు. మండలంలోని పనుకువలస, పి.కోనవలస రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం సాగుభూమి ఆరోగ్యాన్ని పెంచడానికి అవసరమయ్యే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు 36 క్వింటాలు. కట్టెజనుము 34, పిల్లి పెసర రెండు క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కావాల్సిన రైతులు డి-కృషిలో రిజిస్ట్రేషన్‌ చేసి అందిస్తామని తెలిపారు. అలాగే రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సుమారు 1900 ఎకరాల్లో వరి పంట సాగు చేసే అవకాశం ఉన్నందున ఎంటియు 1064 విత్తనం 80 క్వింటాళ్లు ఎంటియు 1121 రకం 180 క్వింటాళ్లు, ఆర్‌జిఎల్‌ రకం 230 క్వింటాళ్లు, సాంబమసూరి 36 క్వింటాళ్లు, సోనామసూరి 60 క్వింటాళ్లు, కొత్తరకం ఎంటియు 1318, ఎంటియు 1224 రకం వంటి కొత్త రకాలు కూడా 50 క్వింటాళ్లు జూన్‌ మొదటి వారానికల్లా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలాగే 1600 టన్నుల యూరియా, 650 టన్నుల డిఎపి, 500 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 600 టన్నుల పొటాష్‌ అవసరం కాగా, ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో 275 టన్నుల యూరియా, 160 టన్నుల డిఎపి, 36 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే మండలంలోని ఐదు ఎరువుల షాపుల ద్వారా కూడా అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023ను పురస్కరించుకొని చిరుధాన్యాల సాగు పెంచాలనే ఉద్దేశంతో 19 క్వింటాళ్ల రాగులు, పది క్వింటాళ్ల కొర్ర విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో నవధాన్య పచ్చిరొట్ట విత్తనాలు ఆవశ్యకత భూసారం పెంపుదల. గడ్డిపిక్కల పత్తి నిషేధం, చిరుధాన్యాల సాగు పెంపు వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు పూర్తి సంసిద్ధతతో ఉన్నామని, రైతులకు విఎఎలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో విఎఎ వినోద్‌కుమార్‌, నాగమణి పాల్గొన్నారు. గరుగుబిల్లి : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి రేగిడి విజయభారతి తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల్లో వరి విత్తనాలను నిల్వ చేస్తున్నట్టు తెలిపారు. ఎంటియు 1064 రకం వరి విత్తనాలు 1900 క్వింటాలు, స్వర్ణమసూరి 300, సాంబ మసూరి 300 క్వింటాళ్ల వరి విత్తనాలకు సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపించా మన్నారు. ఈమేరకు ఒకటి, రెండు రోజుల్లో రైతుభరోసా కేంద్రాల్లో వరి విత్తనాలను నిల్వ చేస్తామన్నారు. వరి విత్తనాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ధర నిర్ణయించిన అనంతరం పంపిణీ ప్రారంభించామని ఎఒ విజయభారతి పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి మండలంలో రైతులందరికీ 90 శాతం సబ్సిడీపై పలు రకాల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు మండల వ్యవసాయాధికారి సిహెచ్‌ ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో గిరిజన రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ మేరకు 1200 క్వింటాళ్లు వరి విత్తనాలు, 11 క్వింటాళ్లు చోడి, 3.5 క్వింటాళ్లు కొర్రలు, 65 క్వింటాళ్లు జీలుగ, 50 క్వింటాళ్లు కట్టే జనుము (పచ్చి రొట్ట విత్తనాలు ) అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు ఆయన చెప్పారు.

➡️