విచారణ పేరుతో కాలయాపన

Apr 7,2024 21:42

ప్రజాశక్తి – సాలూరు: స్థానిక మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 20వ నెంబర్‌ షాపు అద్దె బాగోతంపై విచారణ జరిపించే ఉద్దేశం మున్సిపల్‌ కమిషనర్‌కు లేనట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలు కాకముందు జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు షాపు అద్దె గోల్‌ మాల్‌ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కమిషనర్‌ ప్రేమ ప్రసన్న వాణి స్పందిస్తూ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కౌన్సిల్‌లో చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు కావస్తోంది. కానీ విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఫిబ్రవరి 17న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 20వ నెంబర్‌ షాపును మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ జర్జాపు దీప్తి, కౌన్సిలర్లు పరిశీలించారు. ఈ షాపు ఖాళీగా ఉందని అధికారులు చెప్పడంతో అనుమానం వచ్చిన కౌన్సిలర్లు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ షాపు ఖాళీగా లేదని, పట్టణానికి చెందిన ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అధీనంలో ఉందని నిర్ధారణ చేశారు. అక్కడ నుంచి షాపు యజమాని అయిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌తో ఫోన్‌లో మున్సిపల్‌ ఆర్వో రాఘవాచార్యులు మాట్లాడారు. 2017 నుంచి షాపు తన అధీనంలో వుందని, అద్దె చెల్లించలేదని ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అధికారులకు చెప్పడంతో ఖంగు తిన్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్‌ రెవిన్యూ అధికారులు, పాలకుల కుమ్మక్కు విషయం బట్టబయలైంది. ఆయనతో అద్దె డబ్బులు కట్టించాలి. కానీ ఆయన చెల్లించడం లేదు.ఎందుకు చెల్లించడం లేదని నిశితంగా పరిశీలిస్తే ఆయన పట్టణానికి చెందిన ఓ పాలకవర్గ బాధ్యుడికి అద్దె డబ్బులు మొత్తం చెల్లించారనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన ముఖ్య నేత ప్రమేయం వుండడంతో ఈ బాగోతాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. రెండు నెలలుగా విచారణ పేరుతో మున్సిపల్‌ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ గోల్‌ మాల్‌ వ్యవహారంపై విచారణ జరపాలని మున్సిపల్‌ ఎఇ సూరి నాయుడుకు తొలుత బాధ్యతలు అప్పగించారు. తనకు సంబంధం లేని వ్యవహారం కావడంతో తాను విచారణ జరపలేనని ఎఇ స్పష్టం చేశారు. ఇది జరిగి పదిరోజులు కావస్తోంది. ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పద్మావతికి విచారణ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వచ్చి వారం రోజులు కావస్తున్నా ఆమె ఇంకా విచారణ ప్రారంభించలేదు. టౌన్‌ ప్లానింగ్‌ గుమాస్తా సంజరు సెలవులో ఉన్నందున ఇంకా విచారణ ప్రారంభించలేదని టిపిఒ పద్మావతి చెప్పారు. ఆయన లేకుండా తానొక్కదాన్నే విచారణ చేపట్టలేనని ఆమె చెపుతున్నారు. విచారణ పేరుతో షాపు అద్దె గోల్‌ మాల్‌ వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన కీలకనేత జోక్యం ఉన్నందున అధికారులు విచారణ జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్‌ ఖజానాకు జమ కావాల్సిన షాపు అద్దె డబ్బులు లక్షలాది రూపాయలు పక్కదారి పట్టడం చర్చనీయాంశమవుతోంది.

➡️