కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

May 18,2024 20:10

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : ఇవిఎంల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఉల్లిభద్ర వద్దనున్న ఉద్యాన కళాశాలలోని మూడంచెల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం కల్పించాల్సిన భద్రత, వసతుల ఏర్పాట్లను ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అధిక సంఖ్యలో లెక్కింపు కేంద్రం బయట జనాలు చేరుకొనే అవకాశం ఉన్నందున భారీ వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించేందుకు సూచనలు చేశారు. ప్రవేశ మార్గం వద్ద గుర్తింపు కార్డులు కలిగిన సాధారణ ఏజెంట్లను మాత్రమే అనుమతించేలా పోలీస్‌ సిబ్బంది నియామకం, బారికేడ్లను ఏర్పాటు అంశాలపై కలెక్టర్‌, ఎస్‌పి చర్చించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రతను పరిశీలించిన అనంతరం, కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. పార్లమెంట్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేసి నివేదిక అందజేయాలని డిఆర్‌ఒ కేశవనాయుడును ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్‌ పహారాను పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు ముందు రోజు కౌంటింగ్‌ కేంద్రం సమీపంలోని గ్రామస్తులు బయట ప్రాంతవాసులకు ఆశ్రయం కల్పించవద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి ఒ.దిలీప్‌ కిరణ్‌, కంట్రోల్‌ రూమ్‌ ఒఎస్‌డి ఆర్‌.వి.సూర్యనారాయణ, ఆర్‌డిఒ కె.హేమలత, డిఎస్‌పిలు ఎస్‌.ఆర్‌.హర్షిత, జి.వి.కృష్ణారావు, పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతపరిశీలన

విజయనగరం కోట : ఎన్నికల ఇవిఎంలను భద్రపర్చిన జెఎన్‌టియు, లెండీ కళాశాలల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎఎస్‌పి అస్మాఫర్హీన్‌ శనివారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడంచెల భద్రతను పరిశీలించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

➡️