మోడీని ఎందుకు ప్రశ్నించరు? : రాజన్నదొర

May 1,2024 21:47

 ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్‌ చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. సమగ్ర భూముల సర్వే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఆరువేల గ్రామాల్లో రీసర్వే జరిగిందని చెప్పారు. అనేక భూసమస్యల పరిష్కారానికి రీసర్వే దోహదపడుతుందన్నారు. సర్వే వల్ల ప్రభుత్వ, దేవాదాయ, పోరంబోకు, ప్రయివేటు భూములు ఎంతనేది స్పష్టత వస్తుందని చెప్పారు. అంతేకానీ ఈ చట్టం ద్వారా ప్రజల భూములను ఎవరూ లాక్కోరని చెప్పారు. దీనిపై టిడిపి నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై వైసిపి నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై మోడీని ప్రశ్నించలేక చంద్రబాబు నాయుడు గ్యాంగ్‌ వైసిపి ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా టిడిపి, జనసేనలను నమ్మే స్థితిలో జనం లేరని రాజన్నదొర చెప్పారు.25వ వార్డులో ప్రచారంపట్టణంలోని 25వ వార్డు బంగారమ్మపేటలో డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన ఇంటింటికీ తిరిగి జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థుందర్నీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ సింగారపు ఈశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 21వ వార్డులో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని సారిక పంచాయతీ దండిగాం, మిర్చి గుడ్డివలస గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి, మండల వైసిపి నాయకులు పువ్వాడ గణేష్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు

➡️