మాజీ వలంటీర్‌కు రామిరెడ్డి పరామర్శ

Jun 25,2024 22:41
ఫొటో : పరామర్శిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ రామిరెడ్డి

ఫొటో : పరామర్శిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ రామిరెడ్డి
మాజీ వలంటీర్‌కు రామిరెడ్డి పరామర్శ
ప్రజాశక్తి-కావలి : ఇటీవల టిడిపి మద్దతుదారుల దాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొంది మంగళవారం ఇంటికి వచ్చిన వైసిపి కార్యకర్త, మాజీ వలంటీర్‌ హన్మకొండ రాజీవ్‌కుమార్‌ (నటరాజ్‌)ను కావలి మాజీ ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. వైసిపి నాయకులు, కార్యకర్తల ఇళ్ళకి వెళ్లి వారిపై వారి ఆస్తులపై దాడులు చేయడం హేయమైన చర్యని తెలిపారు. డ్యాన్స్‌ నేర్పిస్తూ చిన్నచిన్న డ్యాన్స్‌ కార్యక్రమాలు చేసుకొని వాటి ద్వారా జీవనం పొందుతున్న హన్మకొండ రాజీవ్‌ కుమార్‌ను వైసిపి మద్దతుదారుడు అనే కారణంగా 15మంది టిడిపి మద్దతుదారులు మూకుమ్మడిగా దాడి చేయడం మంచి పద్ధతి కాదని ఇటువంటి అరాచకాలను ప్రోత్సహించడం నూతన ఎంఎల్‌ఎకు తగదని వారు తెలిపారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది అభివృద్ధి చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి, మాత్రమే అని, అభివృద్ధికి తాము కూడా సహకరిస్తామని, ఇటువంటి అరాచకాలు సృష్టిస్తే ప్రజలు సహించరని, అటువంటి వారిని ప్రజలు గమనిస్తూ ఉంటారని తెలిపారు. కావలి నియోజక వర్గంలో ఒక వర్గానికి చెందిన మీడియా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధి లో 125 ఎకరాల భూమిని కబ్జా చేశారని, దానికి తాను సహకరించానని, తనపై అభూత కల్పనలు సృష్టిస్తూన్నారు. ఒకవేళ అటువంటి కబ్జాలు జరిగివుంటే ఎక్కడ జరిగింది.. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా నిరూపించాలని మాజీ ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి కోరారు.

➡️