100 కోట్ల జనం జేబుకు చిల్లు

  • మొబైల్‌ ఛార్జీల మోత
  • జియో బాటలో ఎయిర్‌టెల్‌
  • త్వరలోనే వొడాఫోన్‌ ఐడియా దెబ్బ
  • ఆదాయాలు పెరిగినా భారీగా వడ్డింపు
  • వినియోగదారుల ఆందోళన

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న ప్రజలపై తాజాగా మొబైల్‌ కంపెనీలు ఛార్జీల బాదుడును ప్రారంభించాయి. రిలయన్స్‌ జియో తమ వినియోగదారులపై 25 శాతం వరకు అదనపు భారం మోపగా.. అదే బాటలో భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. మరో ప్రయివేటు టెల్కో వొడాఫోన్‌ ఐడియా త్వరలోనే ఛార్జీల పెంపునకు సమయత్తం అవుతోంది. దిగ్గజ మూడు టెల్కోల నిర్ణయాలతో దాదాపు 100 కోట్ల మంది వినియోగదారుల జేబులకు చిల్లు పడనుంది. వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌ ధరల పెంపులో తొలి గిఫ్ట్‌ ఇదే కావడం గమనార్హం.
టెలికం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో ఎన్‌డిఎ ప్రభుత్వ మద్దతుతో మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు టారిఫ్‌ ధరల పెంపును చేపట్టాయి. చివరి సారిగా 2021 డిసెంబర్‌లో దాదాపు 20 శాతం టారీఫ్‌లను పెంచాయి.
జియో మార్కెట్లోకి వచ్చిన 2016 చివర సమయంలో రూ.149కే అపరిమిత ఉచిత కాల్స్‌, డేటాను అందించింది. ఆ తర్వాత డేటాను తగ్గించడమే కాకుండా ఈ ప్లాన్‌ ధరను రూ.209కి చేర్చింది. తాజాగా 249కి పెంచింది. ఈ లెక్కన ఇకపై ఒక్కో వినియోగదారుడిపై ఏడాదికి కనీసం రూ.1200 భారం పెరిగినట్లు. ఇదే బాటలో మిగితా ప్రయివేటు టెల్కోలు ప్రయాణించాయి. చాపకింద నీరులా దాదాపుగా మూడు, నాలుగు సార్లు చార్జీలను పెంచాయి.
2024 ఫిబ్రవరి ముగింపు నాటికి రిలయన్స్‌ జియో 42.67 కోట్ల వినియోగదారులతో 40.18 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ 38.26 కోట్లతో 32.97 శాతం వాటాను, వొడాఫోన్‌ ఐడియా 19.38 కోట్ల వినియోగదారులతో 18.93 శాతం వాటాలను కలిగి ఉంది. 2024 మార్చి ముగింపు నాటికి జియోకు ప్రతీ వినియోగదారుడి నుంచి రాబడి (ఎఆర్‌పియు) రూ.181.7గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఎఆర్‌పియు రూ.209గా ఉంది. తాజా పెంపునతో ఆ కంపెనీలకు మరింత రాబడి పెరగనుంది.

పొంతన లేని లెక్కలు..
పలు ప్రపంచ దేశాల వినియోగదారల సగటు మొబైల్‌ బిల్‌ వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ ధరలు ఉన్నాయని టెలికం కంపెనీలు ప్రధాన వాదన. అందులో ప్రధానంగా సింగపూర్‌, మలేషియా, చైనా, ఫిలిప్పిన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల వినియోగదారుల సగటు వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ మొబైల్‌ చార్జీలు అమల్లో ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే ఆయా దేశాల ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం అత్యల్పమన్న విషయాన్ని టెలికం కంపెనీలు చెప్పడం లేదు. అదే విధంగా భారత్‌తో పోల్చితే ఆయా దేశాల్లో వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ. భారత్‌లో వాడకందారులు ఎక్కువ కాబట్టి.. ఛార్జీలు తక్కువగా ఉన్న ఎక్కువగా రెవెన్యూ వస్తుందనేది వాస్తవం.

ఐదేళ్లలో ఆదాయాలు రెట్టింపు..
తమకు ఆదాయాలు సరిపోవడం లేదని.. ఛార్జీలు మరింత పెంచాల్సిన అవసరం ఉందని టెలికం కంపెనీలు పదే పదే చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో వాటి ఆదాయాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2018-19 నాటి ఆదాయాలతో పోల్చితే.. 2023-24లో టెల్కోల రెవెన్యూ ఏకంగా 87 శాతం పెరిగి రూ.2.39 లక్షల కోట్లకు చేరిందని గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ ఇటీవల వెల్లడించింది. 2023-24లో జియో స్థూల రెవెన్యూ 10.4శాతం పెరిగి రూ.1 లక్ష కోట్లను చేరగా.. నికర లాభాలు 11.48 శాతం ఎగిసి రూ.20,607 కోట్లుగా నమోదయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభాలు 10.5 శాతం తగ్గి రూ.7,467 కోట్లుగా ప్రకటించింది. కాగా.. సంస్థ రెవెన్యూ 7.8 శాతం పెరిగి రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. 2023-24లో వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ వాటా స్వల్పంగా తగ్గినప్పటికీ.. రెవెన్యూ మాత్రం యథాతథంగా రూ.42,382 కోట్లుగా చోటు చేసుకుంది. భారత టెల్కోలు లాభాలు, రెవెన్యూలను దండిగానే ఆర్జిస్తున్నప్పటికీ.. వినియోగదారులపై మళ్లీ భారం మోపాలనే యోచన ఆందోళకరం. ఇది ప్రజల పొదుపు శక్తిని దెబ్బతీయనుంది.

ఎయిర్‌టెల్‌ ఛార్జీలకు రెక్కలు
రిలయన్స్‌ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారులపై భారం మోపింది. గురువారం జియో ప్లాన్లపై సరాసరి 12.5 శాతం నుంచి గరిష్టంగా 25 శాతం వరకు ధరలు పెంచేసింది. ఇదే క్రమంలో శుక్రవారం భారతీ ఎయిర్‌టెల్‌ తన వివిధ ప్లాన్‌లపై టారిఫ్‌లను 10-21 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతీ వినియోగదారుడిపై సగటు రాబడి (ఎఆర్‌పియు) రూ.300 కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. పెంచిన మొబైల్‌ టారిఫ్‌లు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ప్రస్తుతం ప్రధానంగా ఫీచర్‌ ఫోన్లలో ఉపయోగించే రూ.179గా ఉన్న ప్లాన్‌ ధరను ఇప్పుడు రూ.199కి చేర్చింది. మరో బేస్‌ ప్లాన్‌ రూ.265ను రూ.299కు చేర్చగా, రూ.299గా ఉన్న ప్లాన్‌ వ్యయాన్ని రూ.349కు పెంచింది.

➡️