రూ.16.53 కోట్లు ‘చెత్త’ భారం

Apr 9,2024 20:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : 2021 నవంబర్‌ 1వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో క్లీన్‌ ఎపి క్లాప్‌ కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా చెత్త సేకరణ ప్రభుత్వం బాధ్యత కాదంటూ అందుకు అవుతున్న ఖర్చును ప్రజల నుంచి వసూలుకు శ్రీకారం చుట్టారు. దీంతో విజయనగరం ప్రజలపై ఏడాదికి రూ.6.84 కోట్ల రూపాయల భారం మోపారు. ఇలా రెండున్నరేళ్లలో ఇప్పటివరకు రూ.16.53కోట్లు ప్రజల నెత్తిన చెత్త భారం వేశారు. కేంద్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను బడా కంపెనీలకు కట్టబెట్టడంలో భాగంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు చెత్త నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకొని అందుకు అవసరమైన ఖర్చులను ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. కేంద్రం ఆదేశాలకు లొంగిన రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్నును ప్రజలపై రుద్దింది. నగరంలో 67,698 కుటుంబాలు, 3946 వ్యాపార సంస్థలు నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి నెలకు రూ.60నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతినెలా రూ. 57లక్షల 21వేల 100 ప్రతి నెలా వసూళ్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నగరంలో 56 చెత్త వాహనాలను తిప్పుతున్నారు. ఈ వాహనాలకు ఏటా కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. పారిశుధ్య నిర్వహణను ప్రైవేటీకరించి ప్రజలకు హాని చేస్తోంది. బడా కంపెనీలు, అధికార పార్టీ నేతల జేబులు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎన్నికైన కౌన్సిళ్లకు తెలియకుండా చెత్త వాహనాల ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుంది. ఒక్కొక్క వాహనానికి నెలకు 63,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో సంవత్సరానికి కోట్ల రూపాయలు బడా కంపెనీలకు కట్టబెట్టే ఈ ఒప్పందం అన్ని నగర పాలక సంస్థల్లోనూ అమలవుతోంది. బడా కంపెనీల జేబులు నింపేందుకు వైపిపి ప్రభుత్వం చెత్త పన్నును దౌర్జన్యంగా ప్రజల నుంచి వసూలు చేస్తుంది. చెత్త పన్ను రాజ్యాంగ విరుద్ధమైనది. ఇప్పటికే ఆస్తి పన్నులో పారిశుధ్య పన్ను ఇమిడి ఉంది . చెత్త పన్ను వసూలుపై విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తిరగబడ్డారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఈ పన్నును వ్యతిరేకించారు. పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాల, స్థానిక సంస్థల రాజ్యాంగ బద్ధమైన బాధ్యత. ఆ బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థకు హక్కులపై దాడి చేస్తుంది. ఆ బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకొని ప్రజల మీద భారాలు మోపుతూ, బడా కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ సంస్కరణల విధానాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది, కమిషనర్‌ మొదలు వాలంటీర్ల వరకు చెత్త పన్ను వసూళ్లలో మునిగి తేలుతున్నారు. ప్రజలను వేధించి, పీడించి, దౌర్జన్యంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నెల వారి వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ డబ్బులులో చెత్తపన్ను డబ్బులు కట్‌ చేసి మిగిలిన డబ్బులు ఇవ్వడం కొన్నాళ్లు జరిగింది. ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాలకులు వెనక్కి తగ్గారు. వాస్తవానికి చెత్త పన్ను ఎప్పుడూ నగర పాలకసంస్థ ల్లో, మున్సిపాలిటీల్లో వసూలు చేయలేదు. ప్రపంచబ్యాంక్‌ షరుతుల్లో భాగంగా పట్టణ సంస్కరణలను తీసుకొచ్చి అందించిన సేవలకు పన్నులు వసూలు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో వసూలు విషయంలో కొంత వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం బలవంతంగా వసులు చేయనుంది. లక్ష్యం రూ.16.53కోట్లు..వసూలు రూ.5.30కోట్లు ప్రతి నెలా ఇంటి యజమానులతో సహా అద్దెదారుల నుంచి నెలకు రూ.60 నుంచి 120 రూపాయల వరకు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు మొదలు వ్యాపారులు అందరి వద్ద నుండి నెలకు రూ.150 నుంచి 15వేల రూపాయల వరకు చెత్త పన్ను విధిస్తున్నారు. 2021 నవంబర్‌ నుంచి అమలు చేయడంతో ఇప్పటి వరకు రూ.16.53కోట్లుకు గాను రూ5కోట్ల 30లక్షల 20వేల 260 వసూలు చేశారు. మిగిలిన మొత్తాన్ని తర్వాత బలవంతంగా వసూలు చేయనున్నారు.

➡️