హక్కులను కాలరాస్తున్న పాలకులు

Apr 26,2024 21:45

సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్స

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  : గత పదేళ్లగా అధికారంలో ఉన్న పాలకులు కార్మిక, కర్షక, గిరిజన, దళిత వర్గాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అన్నారు. ఈనేపథ్యంలో మతతత్వ బిజెపిని ఓడించి అణగారిన వర్గాలను ఏకం చేసి వారి తరఫున నినదించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం పార్వతీపురం మండలం బందలుప్పి, పులుగుమ్మి, జమ్మిడివలస గ్రామాలలో సీనియర్‌ సిపిఎం నాయకులు ఎం.కృష్ణమూర్తితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చి అడవులను కార్పోరేట్‌ కంపెనీలకు కట్టబెట్టాడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. చట్టాలను మారుస్తూ జీవో నెంబర్‌ 3 ద్వారా దక్కాల్సిన ఉద్యోగాలను దక్కకుండా చేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఉపాధి లేక గిరిజన యువత వలసలు పోతున్నారని, గిరిజన గ్రామాలలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు గిరిజన భూములను అదానీకి హైడ్రో ఎలక్ట్రిసిటీ విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కట్టబెడుతున్నారని అన్నారు. హక్కుల సాధన గిరిజన ప్రాంతాన్ని రక్షించుకునేందుకు సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️