పరికరాలున్నా పరీక్షల కోసం పరుగులు

Apr 20,2024 23:51

సీలు చెయ్యని రూ.20 లక్షల ఖరీదైన మిషనరీ
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
రూ.లక్షలు వెచ్చించి అధునాతన పరికరాలు సమకూర్చినా వాటిని ఉపయోగించుకునే ఏర్పాటు మాత్రం చేయలేదు. ప్రతి రెండు వారాలకు ఒకసారి రక్త నమూనాలు పట్టుకుని గుంటూరుకు వెళ్లి పరీక్షలు చేయించాల్సి వస్తోంది. ఇందుకు తడవకు రూ.60-70 వేల వరకూ ఖర్చవుతోంది. స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఎయిడ్స్‌ విభాగంలో ఈ దుస్థితి నెలకొంది.పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఉంది. పట్టణంతోపాటు నియోజకర్గ పరిధిలోని ఎయిడ్స్‌ బాధితులందరూ ఇక్కడే వైద్యం, మందులు పొందుతుంటారు. ఈ సెంటర్‌ పరిధిలో ఎయిడ్స్‌ బాధితులు మొత్తం 3365 మంది ఉండగా వీరిలో 1361 మంది పురుషులు, 1808 మంది మహిళలు, 10 మంది ట్రాన్స్‌జెండర్లు, 46 మంది బాలురు, 32 మంది బాలికలు. వీరందరికీ ప్రతినెలా అవసరమైన మందులతోపాటు నిర్ణీత సమయాల్లో చేయాల్సిన రక్త, ఇతర పరీక్షలు ఇక్కడే చేయాల్సి ఉంటుంది. పరీక్షలు చేయడానికి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నా వాటిని పెట్టుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. సాధారణంగా ఎయిడ్స్‌ బాధితులకు వివిధ రకాల పరీక్షలు చేయాల్సి వస్తుంది. వీటిల్లో కొన్నింటిని స్థానికంగానే చేస్తున్నారు. ప్రధానంగా వైరల్‌ లోడ్‌ను నిర్థారించే సిడి-4 పరీక్షలు చేయడం ద్వారా బాధితులకు రక్తంలో ఎంత శాతం వరకు సోకింది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది నిర్థారించడం కీలకం. ఇందుకోసంగాను ఎయిడ్స్‌ విభాగానికి రూ.20 లక్షలతో పరికరాన్ని నాలుగు నెలల కిందటే సమకూర్చారు. అయితే దాన్ని ఏసీ గదిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సదుపాయం ఏర్పాటు చేయని కారణంగా ఆ పరీక్షల కోసం రక్త నమూనాలను గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌), వైద్య కళాశాలు (జిఎంసి)కు వెళ్తున్నారు. వారానికి రెండుసార్లు వెళ్లాల్సి వస్తోందని, తడవకు 10-15 రక్త నమూనాలను తీసుకెళ్తామని, ఇందుకుగాను ఏడాదికి రూ.70 వేల వరకూ ఖర్చవుతోందని, ఫలితాల కోసం 10-15 రోజుల వరకూ నిరీక్షించాల్సి వస్తోందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఇదే పరీక్షలను ప్రైవేటుగా చేయించాలంటే చెన్నరు, ముంబరుకు వెళ్లాల్సి ఉంటుందని, ఒక్కొక్కరికి రూ.6 వేల నుండి రూ.8 వేల వరకూ ఖర్చువుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎయిడ్స్‌ బాధితులకు ఇచ్చే ఎయిడ్స్‌ బాధితులకు ఇచ్చే మందులను నిల్వ చేసుకోవడానికీ సదుపాయాలు కరువయ్యాయి. ఈ మందులను 2-8 డిగ్రీల చల్లని వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక ఫ్రిజుల్లో వీటిని పెడతారు. ఆ ఫ్రిజ్‌లకూ ఏసీ అవసరం. అయితే ఈ కేంద్రం పాత భవనంలో ఉన్న కారణంగా ఏసీ సదుపాయం కల్పించలేదు. పక్కనే అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఏరియా ఆస్పత్రిలోనైనా కేంద్రం నిర్వహణకు చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన సిబ్బంది నుండి వ్యక్తమవుతోంది. లేకుంటే కనీసం ఉన్న భవనంలోనైనా మరమ్మతులు చేయించి ఏసీ సదుపాయం కల్పించి వైర్య పరికరాలు ఉపయోగించడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ఇటీవల ఇదే కేంద్రంలో హెపటైటిస్‌-బి, సి పరీక్షలనూ ఇక్కడే చేసి వ్యాక్సిన్‌ కూడా వేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ రామచంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 2394 మందికి పరీక్షలు చేశామని, 2300 మందికి వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు. అవసరాలు పెరిగిన నేపథ్యంలో తమ విభాగానికి సదుపాయాలు కల్పిస్తే మరింతగా వైద్యసేవలు అందించగలమని అంటున్నారు.

➡️