సీలేరు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి బుజ్జిబాబు

ప్రజాశక్తి -సీలేరు :

జీకే వీధి మండలం సీలేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌ గ్రేడ్‌ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి, గాలికొండ ఎంపీటీసీ అంపరంగా బుజ్జిబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు చిత్త శుద్ధితో వ్యవహరించాలన్నారు. సీలేరులో బాలిక ఆశ్రమం పాఠశాలలో 9వ తరగతి వరకే ఉండడంతో పదో తరగతి చదవడానికి గిరిజన విద్యార్థినులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. 9వ తరగతి వరకు అదే పాఠశాలలో చదివి పదో తరగతి వేరే దగ్గర చదవాలంటే విద్యార్థులకు సీట్లు కొరత, ఇతర సమస్యలు ఎదురవుతున్నారని తెలిపారు. బాలికల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయమని ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిడి, ఏటిడబ్ల్యుఓలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఐటీడీఏ పిఓ, జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కొర్ర బాలయ్య, పాంగి బాబురావు పాల్గొన్నారు.

➡️