గడిగెడ్డపై తీవ్ర నిర్లక్ష్యం

Apr 4,2024 21:42

మధ్యలో నిలిచిన కాలువ లైనింగ్‌ పనులు

శివారు భూములకు అందని నీరు

ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూపు

నాడు టిడిపి.. నేడు వైసిపి నిర్లక్ష్యం

కాలువ గట్టును తవ్వేస్తున్నా పట్టని అధికారులు

ప్రజాశక్తి-గుర్ల  : ప్రభుత్వాలు మారినా రైతుల బాధలు మాత్రం తీరడం లేదు. రైతే దేశానికి వెన్నెముక అని ఊదరగొడుతున్న పాలకులు రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడినా వ్యవసాయ భూములకు సాగునీరు అందించిన దుస్థితి నెలకొంది. గుర్ల మండలానికి సంభందించి ఏకైక సాగునీటి ప్రాజెక్టు గడిగెడ్డను 1965లో నిర్మించారు. అప్పటి గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జి. సూర్యనారాయణ, పెనుమత్స సాంబశివ రాజు పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కుడి ఎడమ కాలువల నుండి 2900 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కుడి కాలువ ద్వారా పకీరుకిత్తలి, బూర్లిపేట, పల్లిగండ్రేడు, గరికివలస, గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి సాగు నీరు అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా తెట్టంగి, గూడెం, పాలవలస, పున్నపురెడ్డి పేట, గోషాడ, కలవచర్ల గ్రామాలకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారిన గోషాడ, కలవచర్లగ్రామలకు గడిగెడ్డ నీరు అందని ద్రాక్షలానే ఉంది. లైనింగ్‌ పనులు పూర్తి కాకపోవడంతో కుడి కాలువ పరిధిలో కెంగువ, గరికివలస, ఎడమ కాలువకు సంబంధించి గూడెం, పున్నపురెడ్డి, పాలవలస భూములకు నీరందడం లేదు. 2009 ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్య నారాయణ గడిగెడ్డ కాలువల అభివృద్ధి, సిమెంట్‌ లైనింగ్‌ పనులకు రూ.16 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కుడు,ఎడమ కాలువలకు సగం వరకు పనులు చేసి వదిలేశారు. దీంతో ఆయకట్టు శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదు. కుడి, ఎడమ కాలువ కింద రైతులు కాలువ గుట్టును జెసిబిల సాయంతో తవ్వేస్తున్నా అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. విషయం తెలిసిన గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు కిమ్మనడం లేదు. ఎవరినైనా గట్టిగా అడిగితే వారికి ఓట్లు రవేమో అని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కిమిడి మృణాళిని తోటపల్లి ప్రాజెక్ట్‌ నుండి గడిగెడ్డకు సాగునీరు అందించే కృషి చేసారు. 2016 నుండి 2018 వరకు తోటపల్లి నీరు వచ్చింది. గడిగెడ్డ అభివృద్ధి పనుల్లో భాగంగా సర్‌ప్లస్‌ చప్టా పై నుంచి రహదారి సౌకర్యం కల్పించాలని పరిసర గ్రామస్తులు కోరడంతో తేలిక పాటి వాహనాలు వెళ్లేందుకు, గడిగెడ్డ నీటి నిల్వ సామర్ధ్యం పెంచేందుకు అప్పటి మంత్రి కిమిడి మృణాళిని రూ.13 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. పనులు జరుగుతున్న సమయంలో 2019 సాధారణ ఎన్నికలు వచ్చాయి.ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టింది. ఇందులో భాగంగా గడిగెడ్డ అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి. గతంలో టిడిపి ప్రభుత్వం, నేడు వైసిపి ప్రభుత్వం రెండూ గడిగెడ్డ అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపాయని రైతులు వాపోతున్నారు.

➡️