ఏడు ప్రభుత్వ హైస్కూళ్లు కళాశాలలుగా అప్‌ గ్రేడ్‌

May 23,2024 20:59

అడ్మిషన్లు కోసం విద్యాశాఖ కసరత్తు

శ్రీ ఎంపిసి, సిఇసిలో అడ్మిషన్లు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం జిల్లాలో ఏడు ప్రభుత్వ జెడ్‌పి హైస్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌ గ్రేడేషనన్‌ చేశారు. గత ఏడాది ధర్మవరం హై స్కూల్‌ను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయడంతో అక్కడ ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో మరో ఏడు ప్రభుత్వ జెడ్‌పి హైస్కూళ్లను జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తూ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. జామి, బొండపల్లి, కోనూరు, రామభద్రపురం, ఎ.వెంకటాపురం, పిరిడి జెడ్‌పి ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదటి సంవత్సరం కేవలం ఎంపిసి, సిఇసి గ్రూపుల్లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించారు. ఆయా పాఠశాలల పరిధిలో ఇటీవల పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారిని జూనియర్‌ కళాశాలల్లో చేర్పించే బాధ్యతను మండల విద్యా శాఖ అధికారికి, జూనియర్‌ కళాశాలగా మారుతున్న హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అప్పగించారు. జూన్‌ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుండంతో విద్యార్థులను జల్లెడ పట్టే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి గ్రూపునకు 40 మంది విద్యార్థులు ఉండటంతో పూర్తి సంఖ్యలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు అప్పగించారు. దీంతో ఆ పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన వారిని, చుట్టుపక్కల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన వారిని ఒప్పించే పనిలో ఉపాద్యాయులు, మండల విద్యా శాఖ అధికారులు నిమగమయ్యారు.

అడ్మిషన్లు జరుగుతున్నాయి

జూనియర్‌ కళాశాలలు గా ఏడు ప్రభుత్వ జెడ్‌పి హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేశారు. ఈఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే మంజూరైన రెండు గ్రూపుల్లో విద్యార్థులను చేర్పించే ప్రక్రియను ప్రారంభించాం. సీనియర్‌ ఉపాధ్యాయులు, అనుభజ్ఞులు బోధించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి .

ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

➡️