రోడ్లపైనే మురుగునీరు

May 26,2024 20:37

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు పలు వార్డుల్లో, కాలువల్లో ఉండే మురుగు నీరు రోడ్లపైన ప్రవహిస్తుండడంతో స్థానికులు మున్సిపల్‌ ప్రజారోగ్య అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్‌ పాలకవర్గం ఏర్పడిన తొలి రోజుల్లోనే పట్టణంలో గల కాలవల్లో పూడికలు తొలగించారు. ఆ తర్వాత మూడేళ్లు కావస్తున్నప్పటికీ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలతో పాటు, 30 వార్డుల్లో ఉన్న కాలువల్లో పూడికలను తొలగించలేదు. దీంతో అన్ని కాలువల్లో పూడికలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్ధాలు, చెత్తలు పేరుకుపోయాయి. దీంతో ఆయా వార్డుల్లో గల కాలువల గుండా మురుగునీరు వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో ఆ మురుగునీరు కాలువలపై నుంచి పొంగి రోడ్లపైనే పారుతుంది. ఇంత జరుగుతున్నా అటు పాలకవర్గ సభ్యులు గానీ, ఇటు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు గానీ, ప్రజారోగ్య విభాగం అధికారులు సిబ్బంది గానీ పట్టించుకోకపోవడం పట్ల వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తొలగించాలని కోరుతున్నారు.

➡️