ష నాయకుల ‘మందు చూపు’

Apr 21,2024 22:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నుంచి అడ్డంకులు పెరుగుతుండటంతో ముందస్తుగానే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ అనుయాయులకు చెందిన రహస్య స్థావరాల్లో మద్యం నిల్వ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. అధికారులు ఎన్ని చెకోపోస్టులు ఏర్పాటు చేసినా రహస్య స్థావరాలకు తరలిపోతోంది. జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ కేంద్రాల నుంచి ముఖ్యమైన గ్రామాలకు ఇప్పటికే డబ్బు, మద్యం ఎలా తరలించాలనే అంశంపై ఆయా పార్టీల నాయకులు ప్లాన్‌ గీశారు. గతంలో జిల్లాలోని టిడిపి, వైసిపి పార్టీలకు చెందిన వారికే ఎక్కువ మద్యం దుకాణాలు, బార్లు ఉండేవి. కొన్నేళ్లుగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటం వల్ల ప్రతిపక్ష పార్టీల వారికి సరుకు దొరకని పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం, పక్కనే ఒడిశాలో తక్కువ ధరకు దొరుకుతుందటంతో పక్క రాష్ట్రాలపై దృష్టి సారించారు. అంతేగాక రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదు. ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లపై మద్యం ప్రియులు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి అర్డర్లపై కొనుగోలు చేసి రహస్య స్థావరాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా మద్యం నిల్వలు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలో ఎస్‌ఇబి అధికారులు ఎక్కడికక్కడ దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని అడ్డుకుని స్వాదీనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ జిల్లాల్లోని ఎక్కువ మంది అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉన్న వ్యాపారులు, బంధువుల నివాసాలకు మద్యం, డబ్బు తరలిస్తు న్నారు. నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల గ్రూపు నాయకుల ద్వారా మద్యం పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందుగానే మద్యం, డబ్బు పంపిణీతోనే పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రధాన రాజకీయపార్టీలు దృష్టి సారిస్తున్నాయి. నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత సరిహద్దులో తనిఖీలు మరింత ముమ్మరమైనప్పటికీ అప్పటికే మద్యం బాటిళ్లను ఎక్కడికక్కడ నిల్వ చేసుకున్నారు. మరోవైపు ఒడిశా నుంచి సారా యథేచ్ఛగా సరిహద్దు గ్రామాలకు సరఫరా అవుతోంది. అటు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట మండలాలతో పాటు విజయనగరం జిల్లాలోని మెంటాడ, గజపతినగరం, ఎస్‌.కోట మండలాల్లోని పలు గ్రామాల్లో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భారీగా మద్యం, సారా పట్టివేత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఈనెల 15 వరకు 67 నాటుసారా కేసులను ఎస్‌ఇబి అధికారులు నమోదు చేశారు. 1475 లీటర్ల సారా పట్టుకున్నారు. 16 మందిని అరెస్టు చేశారు. 34,400 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 53 లిక్కర్‌ అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. 399 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1592 లీటర్ల మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. 170 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 61 వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 583 కిలోల గంజాయి నిల్వలను పట్టుకున్నారు. 15 మందిని అరెస్టు చేశారు.

➡️