ఎపికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

ఇండియా బ్లాక్‌

ప్రజాశక్తి – అనకాపల్లి : విభజన హామీలు అమలు, ఎపికి ప్రత్యేకహోదా, స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ ఇండియా బ్లాక్‌ విజయంతోనే సాధ్యమని అనకాపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఐఆర్‌.గంగాధర్‌ అన్నారు. మంగళవారం అనకాపల్లి పట్టణంలోని పూడిమడక రోడ్డు, పెదరెల్లి వీధి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లు అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన వ్యక్తి నేడు ఓటమి భయంతో పక్క జిల్లాకు వెళ్లిపోయాడంటే, వైసిపి చేసిన అభివృద్ధి, ప్రజల్లో ఆపార్టీకి ఉన్న విశ్వసనీయత ఏపాటిదో స్పష్టమౌతోందన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడం, అవినీతి, ఆశ్రితపక్షపాతం, వేధింపులు, అరాచకాలే హంగులుగా వైసిపి పాలన సాగించిందని మండిపడ్డారు. ఎపికి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజీ వంటి విభజనహామీలతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలను నమ్మబలికి పదేళ్లు అధికారం వెలగబెట్టిన మోడీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన మోడీ పల్లకిని చంద్రబాబు, పవన్‌ మోయడం తగదన్నారు.స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ, విభజన హామీల అమలుకు ఇండియాబ్లాక్‌ బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనను, అనకాపల్లి ఎంపిగా వేగి వెంకటేష్‌లను గెలిపించాలని గంగాధర్‌ పిలుపునిచ్చారు. ప్రచారంలో పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు దాసరి సంతోష్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కొల్లి సత్యారావు, నందికి విజయకుమార్‌, తాండ్రకోట పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గంగాధర్‌

➡️