కౌంటింగ్‌ రోజున పల్లెల్లోనూ ప్రత్యేక నిఘా

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : జూన్‌ 4న ఎన్నికలు కౌంటింగ్‌ రోజు పల్లెల్లోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అన్ని గ్రామాల్లోనూ మొబైల్‌ టీం సిద్ధం చేశామని రామచంద్రపురం సిఐ పి.దొరరాజు వివరించారు. ఆయన మంగళవారం కే.గంగవరం పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ జూన్‌ 6 వరకు అమల్లో ఉంటుందని అదేవిధంగా 144 సెక్షన్‌ 30 అమలులో ఉంటాయని సీఐ వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, గుంపులు గుంపులుగా జనం గుమికూడదని, అదేవిధంగా ఊరేగింపులు, బాణసంచా కాల్చడం వంటివి నిషేధించామని ఇవన్నీ జూన్‌ 6 వరకు అమల్లో ఉంటాయి అన్నారు. అదేవిధంగా నాలుగో తేదీన మద్యం షాపులు పూర్తిగా మూసివేయాలని ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇప్పటివరకు పాత నేరస్తులను బైండోవర్‌ చేశామని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇచ్చామని కౌంటింగ్‌ రోజు వారు ఎవరు బయటకు రావద్దని, అదేవిధంగా సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పైన ప్రత్యేకంగా నిఘా ఉంచామని దీంతో పాటుగా కిల్లి షాపుల వద్ద పెట్రోలు లూజ్‌ అమ్మకాలు విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశామని నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటుగా మోటార్‌ సైకిళ్లకు సైలెన్సర్లు తీసి నడపడం నేరమని అలాంటివారు వివరాలు తెలియజేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కొత్తగా వచ్చి ఎన్నికలు పై ప్రభావం చూపే వారి పైన దృష్టి సారించామని, గ్రామాల్లోనూ పట్నంలోనూ ఎవరైనా కొత్తగా వస్తే వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని సిఐ సూచించారు. కేంద్ర బలగాలు శాంతిభద్రతల దృష్ట్యా ఆరో తేదీ వరకు ఇక్కడే ఉంటాయని, వారి ద్వారా గ్రామాల్లో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకునేందుకు మొబైల్‌ టీవీ కూడా ఏర్పాటు చేసి నిరంతరం ఆయా గ్రామాల్లో తనిఖీలు చేస్తారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు శాంతిభద్రతలకు ఎవరూ విఘాతం కలిగించవద్దని ఈ సందర్భంగా సిఐ దొరరాజు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో కే గంగరాజు జానీ భాష పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️