వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

Jun 26,2024 21:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రస్తుత వర్షాకాలంలో మలేరియా, అతిసార, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం వున్నందున ప్రజారోగ్య విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందికి నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం ఎం నాయుడు ఆదేశించారు. వ్యాధుల నియంత్రణపై బుధవారం కార్యాలయంలో ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో జనావాసాల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడటం, తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడం, నీటి వనరులు క్రమం తప్పకుండా క్లోరినేషన్‌ చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి చర్యలపై దృష్టి సారించాలని తెలిపారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా దోమల నిర్మూలన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.

పూడిక తీత పనులు పరిశీలన

నగరంలోని ప్రధాన కాలువలతో పాటు, చిన్న చిన్న కాలువలలో కూడా పూడికలు ఉండరాదని పారిశుధ్య సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం ఎం నాయుడు ఆదేశించారు. కంటోన్మెంట్‌, కెఎల్‌ పురం ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. కంటోన్మెంట్‌ గణేష్‌ కోవెల సమీపంలో చాలా కాలంగా పూడిక పేరుకుపోవడంతో వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తుందని గమనించిన ఆయన పూడికలు తీయించే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు . అనంతరం ప్రజారోగ్య విభాగం వ్యర్ధపదార్థాలతో తయారు చేసిన ఆకర్షణీయ పూల కుండీలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.

➡️