అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవే : టిడిపి

Jan 9,2024 21:48

అంగన్వాడీల ఆందోళనలో పాల్గొన్న బాలకృష్ణ

                  హిందూపురం : అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవే అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని సద్బవన్‌ సర్కిల్‌లో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్యలయం ఎదుట మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, ఎఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘీబావం తెలిపారు. ఈ సందర్బంగా కార్మికులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సమ్మె శిబిరంలో కార్మికులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ సమస్యలను చేర్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్‌పి శ్రీనివాసులు, జిల్లా నాయకులు సాంబశివ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు జగదీష్‌, ఎపి అంగన్‌ వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య కోరారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించడానికి చేతగాని ప్రభుత్వం మహిళలు అని కూడా చూడకుండా అంగన్వాడీలపై ఎస్మాను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఎస్మాను ఉపసరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను భయపెట్టి, వేధించి, నిర్బంధ చర్యలకు పూనుకున్న ఏ ప్రభుత్వం, పాలకులు బతికి బట్ట కట్టలేదన్న వాస్తవాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి న్యాయమైన డిమాండ్లను పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మినారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రావెళ్ల లక్ష్మి, కౌన్సిలర్లు రమేష్‌కుమార్‌, రాఘవేంద్ర, సతీష్‌ కుమార్‌, టిడిపి నాయకులు, పారిశుధ్ద్య కార్మిక సంఘం నాయకులు, కార్మికులు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు శిరీషా, శైలజ, వరలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున కార్మికులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. పెనుకొండ : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్‌ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ట అని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె పార్థసారధి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు..తక్షణమే జీవో 2 వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు. 29రోజుల సమ్మె తర్వాత అత్యవసర సేవలని గుర్తించారా అని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చినపుడు ఎందుకు పట్టించుకోలేదన్నారు. అత్యవసర సేవలు అందించే వారికి కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వానికి తెలీదా అని అన్నారు. అంగన్వాడీల సమస్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్‌ చేశారు.

➡️