అధైర్యపడకండి అండగా ఉంటాం

బావయ్య కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందిస్తున్న నారా భువనేశ్వరి

        పుట్టపర్తి రూరల్‌ : టిడిపి కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారి కష్టాల్లో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత టిడిపి కుటుంబ సభ్యులను నిజంగెలవాలి కార్యక్రమం ద్వారా పరామర్శిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులను అందించారు. ముందుగా ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమనాశ్రయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి జిల్లా టిడిపి నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ గాజులపల్లి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బావయ్య చిత్రపటం వద్ద భవనేశ్వరి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం రూ.3లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించారు. అనంతరం ఆమె ఓబుళదేవరచెరువు, తనకల్లు మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. రాత్రికి కదిరిలో బస చేశారు. ఆమె వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్ణప్ప, ఎమ్మెల్సీ అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు బికె.పార్థసారధి, కందికుంట వెంకటప్రసాద్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, సామకోటి ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

➡️