ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలి : యుటిఎఫ్‌

Jan 31,2024 22:20

 రిలే దీక్షలో మాట్లాడుతున్న ఈఎస్‌ . వెంకటేష్‌

                    పుట్టపర్తి రూరల్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బాకీ పడ్డ ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ రిలే దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా నాయకులు ఇఎస్‌ వెంకటేష్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనతో పాటు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుళుశెట్టిపి జయ చంద్రా రెడ్డి, సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు బాకీ పడిందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మూడు నెలల నుంచి దశల వారీ పోరాటాలు చేస్తున్నామన్నారు. మూడవ దశ పోరాటం లో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 1న మడకశిర, 2న హిందూపురం, 3న కదిరి డివిజన్లలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, సునీల్‌, నారాయణస్వామి, ఆంజనేయులు, మురళి, నగేష్‌, చాంద్‌ బాష, క్రిష్టప్ప, నాగేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️