ఇళ్ల మంజూరులో నిర్లక్ష్యం : సిపిఎం

కమిషనర్‌ ఛాంబర్‌ ముందు జరిగిన ఆందోళనలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

           హిందూపురం : పురపాలక సంఘం వ్యాప్తంగా సొంతిళ్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ విమర్శించారు. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు, గృహాలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాడు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ ముందు ఆందోళన చేపట్టారు. కమిషనర్‌ అందుబాటులో లేక పోవడంతో ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌ ముందు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టణంలో నివాసం ఉంటున్న బడగు, బలహీన వర్గాల వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి సొంతిళ్లు లేక అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారన్నారు. అద్దెలు చెల్లించ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మూడేళ్ల కిందట ఎంపిక చేసిన వారితో పాటు కొత్తగ సచివాలయ ఉద్యోగులతో సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం, ఇళ్లను మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ అల చేయలేదన్నారు. లబ్ధిదారులు ధరఖాస్తులను సచివాలయాల్లో ఇస్తే ఆన్‌లైన్‌ చేయడానికి అనుమతులు లేవని నిరాకరిస్తున్నారని చెప్పారు. పేదలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే ధరఖాస్తులను సచివాయాల్లో తీసుకుని వాటిని ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంబదనల మేరకు 90 రోజుల్లో అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలను, ఇళ్లను మంజూరు చేయాలన్నారు. లేని పక్షంలో భూపోరాటం చేసి, ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచుతామన్నారు. ఈ విషయంపై స్పందించిన ఛైర్‌పర్సన్‌ సమస్యను తెలుసుకుని కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో పేదలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతమ్మ, రాయుడు, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ అధ్యక్షురాలు నసీం తాజ్‌, కార్యదర్శి విమల కుమారి, లక్ష్మీదేవి, రమాదేవి, శశికళ, సరస్వతమ్మ, రెడ్డమ్మ, సిఐటియు పట్టణ నాయకులు అత్తర్‌బాబా, నీలమ్మ పాల్గొన్నారు.

➡️