ఓటమి భయంతో ప్రలోభాలకు తెర

Feb 9,2024 22:04

విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైసిపి నాయకులు

                హిందూపురం : గత 10 సంవత్సరాల బాలయ్య పాలనతో పాటు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు టిడిపికి పట్టం కడుతున్నప్పటికి, టిడిపి పాలకులు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది ఏమి లేదని…అభివృద్ది విషయంలో తాము బాలయ్యతో చర్చకు సిద్దంగా ఉన్నామని శ్వేత పత్రం తీసుకుని చర్చలకు రావాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసిపి నాయకులు సవాల్‌ విసిరారు. బాలయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్థానిక వైసిపి కార్యాలయంలో ఆపార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మేన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, వైసిపి నాయకులు వేణురెడ్డి, కొండురు వేణుగోపాల్‌ రెడ్డి, మధుమతి రెడి మాట్లాడారు. నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి బాలయ్య వరకు నియోజక వర్గాన్ని ఏ మాత్రం అభివృద్ది చేయలేదన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 24 సార్లు పర్యటించారని ఈ పర్యటన సైతం పెళ్లిల్లకు, ఇతర సొంత కార్యక్రమాలకు మాత్రమే వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజలు చెల్లించే పన్నులతో తీసుకుంటున్న వేతనంలో కాస్తా పనులు చేపట్టి సొంత నిధులతో అని చెప్పడం చూస్తుంటే హాస్యస్పదంగా ఉందన్నారు. సినీ గ్లామర్‌వల్ల కొందరు వచ్చి సెల్ఫీలు దిగితే అందరు తమకు మద్దతు ఇస్తారనే భ్రమలో నుంచి బాలయ్య బయటకు రావాలన్నారు. సినిమా డైలాగులు చెప్పి ఫోజులిస్తే ఇక్కడ ప్రజలు అమాయకులు కాదన్నారు. 30 మంది వైసిపి కౌన్సిలర్లు ఉంటే ఒక్క కౌన్సిలర్‌ ను టిడిపిలోకి చేర్చుకోవడానికి ఏకంగా ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగాడన్నారు. వైసిపి వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని తాము వారి పార్టీ వారిని ప్రలోభాలు గురి చేయడం మొదలుపెడితే హిందూపురంలో టిడిపికి మనుగడ సైతం ఉండదన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, వైసిపి నాయకులు హనుమంత రెడ్డి, బసిరెడ్డితో పాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

➡️