కరువు సహాయక చర్యలు చేపట్టాలి : సిపిఎం

కరువు సహాయక చర్యలు చేపట్టాలి : సిపిఎం

డీవోకు వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు

పెనుకొండ : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని, వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ మీటర్లు బిగించరాదని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి జిల్లా వ్యాప్తంగా వరుస కరువు, అతివష్టి, అనావష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అసారి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. పంటలు చేతికందక రైతులు అప్పులఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన చేసి, చేతులు దులుపుకోకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఓ వైపు పంటలు లేక మరో వైపు గ్రామాల్లో వలసలు లేక రైతులు, కూలీలు సొంతూర్లను వదలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారన్నారు. వలసలను నివారించేందుకు వెంటనే గ్రామాల్లో ఉపాధి పనులను చేపట్టాలన్నారు. తీవ్ర దుర్భిక్షంలో ఉన్న రైతులను మరింత ఇబ్బంది పెట్టేలా వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు రూ.40 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల అన్ని రకాల అప్పులను మాఫీ చేయాలన్నారు. వలసలను అరికట్టేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి పనులను ఏడాదికి 200 రోజులకు పెంచే, రోజు కూలి రూ.600 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీవోకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నారాయణ, సిపిఎం నాయకులు తిప్పన్న, రంగప్ప, కొండా వెంకటేశులు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️