కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె

Jan 16,2024 22:04

చిలమత్తూరులో అంగన్వాడీల వినూత్న నిరసన

                  హిందూపురం : ‘తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి నాడు కూడా అంగన్వాడీలను పస్తుల పాలు చేశారని, అక్క..చెల్లి అంటునే అంగన్వాడీలను నట్టేట ముంచావ’ని అంగన్వాడీలు నినదిస్తూ తమ ఆందోళన కొనసాగించారు. సోమవారం సద్బవన్‌ సర్కిల్‌లో నడి రోడ్డుపై సంక్రాంతి పొంగలి చేసి నిరసన తెలిపారు. 36వ రోజు మంగళవారం సమ్మె శిబిరంలో నుదిటిపై మూడు నామాలు పెట్టుకుని, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పండుగలు కూడా రోడ్లపైనే అంగన్వాడీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వంలోను రాలేదని జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని అన్నారు. చర్చలకు పిలుస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం చేస్తున్నారని ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి లావణ్య, నాయకులు శిరీష, శైలజ, వరలక్ష్మి, నాగమ్మ, పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. గుడిబండ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. పండుగకు దూరంగా ఉంటూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ పట్ల కనికరం చూపక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అంగన్వాడీలు వాపోయారు. ఈ కార్యక్రమంలో గుడిబండ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి మహదేవమ్మ, సెక్టర్‌ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిలమత్తూరు : సంక్రాంతి పండుగ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్బంగా అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం ముందు సమ్మె స్థలంలో కట్టెల పొయ్యిపై దోసెలు వేసి పండుగను అక్కడే చేసుకున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమలు సమస్య పరిష్కరించాలని కోరుతూ సిఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడీలు సిఎం,పిఎం ఆకారంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం నాయకులు శోభమ్మ, శారద, రామతులసి, తదితరులు పాల్గొన్నారు. బత్తలపల్లి: బత్తలపల్లి ,తాడిమర్రి మండలంలోని అంగన్వాడీలు సంక్రాంతి, కనుమ పండుగనాడు కూడా సమ్మె కొనసాగించారు. 36 నెంబర్‌ గా ఏర్పడి నిరసన తెలిపారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ కన్వీనర్‌ దిల్షాద్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాల్సిన పండుగను కూడా నిరసన శిబిరంలో చేసుకోవాల్సిన దుస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు వాసంతి, ప్రధాన కార్యదర్శి రజియా, సెక్టార్‌ లీడర్లు వసంత, రజిత, పుష్పలత, సున్నిబేగం, తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంటౌన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం కొనసాగింది. సిఐటియు ఆధ్వర్యంలో ఆంగన్వాడీలు తలదించుకుని మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు ఏపీ రైతుసంఘం జిల్లాఅధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ఆదినారాయణ, ఆయూబ్‌ఖాన్‌ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి చంద్రకళ, ఆంగన్వాడీలు పోతక్క, గోవిందమ్మ, దీనా, చింతమ్మ, మాంచాలినిదేవి, భువనేశ్వరి, సరస్వతి పాల్గొన్నారు. లేపాక్షి : మండలంలోని అంగన్వాడీలు తమ సమ్మెను మంగళవారం కొనసాగించారు. ఎస్మా జీవో ప్రతులను ఈ సందర్భంగా దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహప్ప, ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు. మడకశిర : మండలంలోని అంగన్వాడీలు తమ సమ్మెను మంగళవారం కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు సిఎం అనే అక్షరాల ఆకారంలో ఉండి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీదేవి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌: అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు సాధన కొరకు 36 రోజుల నుండి దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలకు మద్దతు పలికారు. ఈసందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ 10 డిమాండ్ల ను అంగీకరించామని చెబుతున్న ప్రభుత్వం వాటిపై జీవోను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షాలతో కలిసి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి కొత్తచెరువు, బుక్కపట్నం మండల అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️