గీతకార్మికులు బైండోవర్‌

గీత కార్మికుల బైండోవర్‌పై రొద్దం పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

        రొద్దం : ఈతవనంలో చెట్ల తొలగింపు విషయంలో న్యాయం చేయాలని కోరిన గీతకార్మికులను పోలీసులు బైండోవర్‌ చేశారు. న్యాయం చేయమని కోరిన వారిపేనే ఇలా బైండోవర్‌ చేసి బెదిరించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. గీత కార్మికులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సిపిఎం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి రొద్దం పోలీసు స్టేషన్‌ వద్ద గీత కార్మికులకు మద్దతుగా సిపిఎం నాయకులు నిలిచారు. మండల పరిధిలోని కంచిసముద్రం గ్రామానికి చెందిన గీత కార్మికులపై బైండోవర్‌ కేసు నమోదు అయ్యిందని పోలీసు స్టేషన్‌కు రావాలంటూ రొద్దం పోలీసులు గురువారం సాయంత్రం సమాచారం ఇచ్చారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గీత కార్మికులు తాము ఏ తప్పు చేశామని, ఎందుకు బైండోవర్‌ కేసు నమోదు చేశారని పోలీసులను అడిగారు. తమకు అన్యాయం జరిగిందని చెబితే తమనే ఇలా బెదిరింపులకు గురి చేయడం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం

      గీత కార్మికులను బైండోవర్‌ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు గురువారం రాత్రి రొద్దం పోలీసు స్టేషన్‌ వద్దకెళ్లారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, సిఐటియు నాయకులు రమేష్‌లు స్టేషన్‌ వద్దకెళ్లి గీత కార్మికులతో మాట్లాడారు. గీత కార్మికులను ఎందుకు బైండోవర్‌ చేస్తున్నారంటూ ఎస్‌ఐ వలీబాషాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ ప్రశ్నించారు. గొడవే జరగనప్పుడు బైండోవర్‌ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఈతవనాన్ని తొలగించి సమస్యకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోకుండా గీత కార్మికులను బెదిరించేలా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. దీనిపై ఎస్‌ఐ స్పందిస్తూ ఈతవనం తొలగింపు విషయంలో రెండు వర్గాల వారినీ బైండోవర్‌ చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల వద్దకెళ్లాలని సమాధానం ఇచ్చారు.

బైండోవర్‌ దుర్మార్గం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

        అకారణంగా గీత కార్మికులను పోలీసులు బైండోవర్‌ చేసి బెదిరింపులకు గురి చేయడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తెలిపారు. రొద్దం పోలీసు స్టేషన్‌ వద్ద గీత కార్మికులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రొద్దం పోలీసులు అకారణంగా గీత కార్మికులను బైండోవర్‌ చేశారన్నారు. దీనిపై తాము ఎస్‌ఐను ప్రశ్నిస్తే పొంతలేని సమాధానం ఇస్తున్నారన్నారు. గీత కార్మికుల బైండోవర్‌ను తక్షణం ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికులకు న్యాయం జరిగే వరకూ సిపిఎం వారి పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ విషయంపై కరపత్రాలను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, సిఐటియు రమేష్‌ గీత కార్మికులు పాల్గొన్నారు.

➡️