గుర్తించిన పార్టీకే మద్దతు

Dec 10,2023 20:50

తమ ఐక్యత చాటుతున్న జిల్లా యాదవ సంఘం నాయకులు

                          పుట్టపర్తి క్రైమ్‌ :తమను గుర్తించే పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతామని యాదవ సంఘం నాయకులు అన్నారు. పుట్టపర్తి పట్టణ కేంద్రంలోని శిల్పారామంలో జిల్లాలోని యాదవ సంఘం నాయకులు ఆత్మీయసమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని యాదవ్‌ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసప్ప యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసప్ప మాట్లాడుతూ పుట్టపర్తిలోని సర్వే నంబర్‌ 22 నందు బోడిగుట్టలో ఉన్న భూమిని గతంలో యాదవుల ఆధీనంలో ఉండేదన్నారు.. కానీ అది ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో యాదవ సంఘానికి సంబంధించి కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు, శ్రీకృష్ణుని దేవాలయానికి ఆ భూమిని కేటాయించాలని కోరారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల యాదవ ఓట్లు ఉన్నాయన్నారు. పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలలో అభ్యర్థుల జయాపజయాలను యాదవుల ఓట్లు ప్రభావితం చేస్తాయన్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో యాదవులకు ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే స్థానాలకు టికెట్లను కేటాయించలన్నారు. ఏ పార్టీ అయితే గుర్తించి టికెట్లు ఇస్తుందో ఆ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు. లేనిపక్షంలో యాదవుల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జనరల్‌ సెక్రెటరీ దయ్యాల ఉమాపతి యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు బాలాంజనేయ యాదవ్‌, నాయకులు వరప్రసాద్‌, గంగాధర్‌, నారాయణస్వామి, నరసింహ, కృష్ణమూర్తి, సుధాకర్‌ శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, రాజశేఖర్‌, సురేంద్ర, కొండయ్య, కిరణ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️