గ్రామ సచివాలయంలో ‘స్పందన’ కరువు

Dec 18,2023 22:00

కోడూరు సచివాలయం 2 లో సిబ్బంది లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు

                       చిలమత్తూరు : సాధారణంగా గ్రామ సచివాలయంలో ప్రభుత్వం నియమించిన సిబ్బంది ఎక్కువ శాతం ఫీల్డ్‌వర్క్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం మధ్నాహ్నం 3 లోపు పని ముగించుకొని స్పందనకు హాజరు కావాలని ఆదేశించింది. దీని కారణంగానే ప్రతి ఉద్యోగి కనీసం 3 గంటల నుండి 5 గంటల వరుకు ప్రతి రోజు స్పందన నిర్వహించి అందుబాటులో ఉంటూ హాజరు కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. మధ్నాహ్యం 3 గంటలు దాటితే సచివాలయంలో కనపడటం లేదు. సచివాలయంలో స్పందన ఉంటుందని భావించిన ప్రజలు వివిధ సమస్యలపై కార్యాలయయానికి వచ్చి ఉద్యోగులు లేక వెనుతిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి కోడూరు సచివాలయం-2 లో సోమవారం చోటు చేసుకుంది. సోమవారం స్పందన సమయంలో కోడూరు-1, కోడూరు-2 సచివాలయాలను పరిశీలించగా కోడూరు-1 లో వెల్పేర్‌ అందుబాటులో ఉండగా, కోడూరు -2 లో ఎవ్వరూ లేరు. అయితే ఓ స్వీపర్‌ తలుపు ముందు కూర్చొని ఉంది. ఎందుకని ప్రశ్నిస్తే సాయంత్రం 5 గంటల తరువాత సచివాలయానికి తాళం వేయాలని చెప్పింది. దీనిపై ఎంపిడిఒ నరేష్‌ క్రిష్ణ ను వివరణ కోరగా డిజిటల్‌ అసిస్టెంట్లు, సచివాలయ కార్యదర్శులు హిందూపురానికి ట్రైనింగ్‌కు వెళ్లారని చెప్పారు. మిగిలిన వారు అందరూ సచివాలయంలో తప్పని సరిగా మధ్నాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిందే అన్నారు. కాని సచివాలయంలో మిగిలిన విభాగాలలో సర్వేయర్లు పెనుకొండలో రీసర్వే లో ఉండగా, మిగిలిన జెఎల్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అసిసెంట్లు, ఎఎన్‌ఎంలు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, వీఆర్వో, మహిళపోలీసులు సచివాలయంలో ఉండాలి. అయితే వీరిలో ముగ్గురు సెలవులో ఉన్నారని కార్యదర్శి నారాయణ స్వామి చెబుతున్నప్పటికీ స్పందన సమయంలో మిగిలిన ఏ ఒక్కరూ సచివాలయంలో లేరు. సచివాలయంలో ఉండే ఏ ఉద్యోగి అయిన మధ్నాహ్నం 3 గంటల వరకే ఫీల్డ్‌కు పరిమితం అవ్వాలి. ఆతర్వాత ఎన్ని పనులు ఉన్న ఖచ్చితంగా సచివాలయంలో ఉండాల్సిందేనని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అలా ఉన్నట్లయితే క్యాస్ట్‌, ఇన్‌కం సర్టిఫికెట్లు, వన్‌బి అడంగల్‌తో పాటు సర్వేకు సంబందించిన సమస్యలు, ఆరోగ్య సంబందిత సమస్యలు, వీధి దీపాలు, విద్యుత్‌ సమస్యలు చెప్పుకోవడానికి సంబంధిత అదికారులు అందుబాటులో ఉండాలి. కానీ వీరు ఎవ్వరు కూడా సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదు. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా ఫీల్డ్‌లో ఉన్నామనే సమాధానాన్ని చెప్పుకొస్తున్నారు. మరి కొంతమంది 4 గంటల సమయంలో ఫోన్‌చేస్తే అంగన్వాడీల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే అంగన్వాడీ మూడుగంటలకే ముగుస్తుంది. ఏదో ఒక సాకుతో సచివాలయానికి రాకుండా కాలక్షేపం చేస్తూ విధులుకు డుమ్మాకొడుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలాంటి వారిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి చర్యలు తీసుకుంటారా లేక ఎప్పటిలాగే కారణాలు చెప్పి వదిలేస్తారా వేచి చూడాలి.

➡️