టిడిపిని వీడే ప్రసక్తే లేదు : బికె

కార్యకర్తలతో మాట్లాడుతున్న బికె.పార్థసారధి

         పెనుకొండ : తెలుగుదేశంపార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధి స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు ఆదివారం బికె బెంగళూరు నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. అంతకుముందు ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేశానని, ఈ క్రమంలోనే జడ్పీ ఛైర్మన్‌గా, ఎంపిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే అజెండాతో ఎప్పటికీ పని చేస్తానన్నారు. నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం బికె ఎంతగానో కృషి చేశారన్నారు. అయితే పెనుకొండ ఎమ్మెల్యే టికెట్‌ విషయంపై అధిష్టానం ఆయనతో చర్చించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి ఆయనకే ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలని కోరారు. దీనిపై పార్థసారధి మాట్లాడుతూ మీ ఆవేదన, అభిప్రాయాలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, అంతవరకూ సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా పార్థసారధితో మాజీ మంత్రి పరిటాల సునీత, సీనియర్‌ నాయకులు ఎల్‌.నారాయ ణచౌదరి సమావేశమై చర్చించారు. అనంతరం విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా మద్దతుదారులు స్థానిక వై జంక్షన్‌ వరకూ భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.

➡️