టిడిపిలో జోష్‌..!

రాప్తాడు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు

         అనంతపురం ప్రతినిధి : ఎన్నికల షెడ్యుల్‌ వెలువడిన తరువాత జరిపిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తొలి పర్యటన తమ్ముళ్లలో జోష్‌ నింపింది. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. మదనపల్లి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో అనంతపురం విచ్చేసిన ఆయన ఉదయం రాప్తాడు బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ బిసిల గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ప్రభుత్వం, వైసిపి తీరుపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై ఆరోపణలు చేయడంతోపాటు తాము అధికారంలోకి వస్తే విచారణ చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక మొదలుకుని అన్నింటినీ దోచేసారని మండిపడ్డారు. బిసిలకు వైసిపి పాలనలో రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. ఈ సభకు నియోజకవర్గంలోని వేలాది మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభ అనంతరం మధ్యాహ్నం ఆర్డీటీ అతిథి గృహంలో బస చేశారు. తదనంతరం మధ్యాహ్నం నుంచి బుక్కరాయసముద్రంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు టిడిపి అభ్యర్థి బండారు శ్రావణితోపాటు అసంతృప్తు నేతలుగానున్న ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, మాజీ జడ్పిటిసి రామలింగారెడ్డి ముగ్గురూ పాల్గొన్నారు. ఈ సభలో చంద్రబాబు దళితుల సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. వైసిపి పాలనలో దళితులకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. వైసిపిలో శింగనమల టిక్కెట్టు తన దగ్గర పనిచేసే ఉద్యోగికి ఇప్పించి అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో చేసిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు. శింగనమల నియోజకవర్గం ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి అని, సాగునీటి వసతి కల్పిస్తే బంగరం పండిస్తారని తెలిపారు. వైసిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. దళితులకు రక్షణగా టిడిపి ఉంటుందని హమీలిచ్చారు. కదిరిలో ముస్లిం మైనార్టీలతో సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇలా బీసీ, ఎస్సీ ,మైనార్టీలను ఆకట్టుకునేలా చంద్రబాబు నాయుడు పర్యటనను కొనసాగించారు. వైసిపి హయంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యనికి గురయ్యాని విమర్శించారు. అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టకుండా మోసం చేసారని మండిపడ్డారు. పరిశ్రమలు ఒక్కటీ రాలేదని, వచ్చిన జాకీ పరిశ్రమను పారిపోయేటట్టు చేసారని దుయ్యబట్టారు. స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున అందరూ ఏకతాటిపైకొచ్చి వైసిపిని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తంగా గురువారం జరిగిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఈ కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు బండారు శ్రావణి, పరిటాల సునీత, కందికుంట వెంకటప్రసాద్‌, కాలవ శ్రీనివాసులు, బికె.పార్థసారధి, పరిటాల శ్రీరామ్‌తో పాటు ఉమ్మడి జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️