నేటి నుంచి పిల్లల పండుగ

బాలోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న నిర్వాహకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : అనంత బాలోత్సవం-4 పిల్లల పండుగ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల పాటు నిర్వహించే అనంత బాలోత్సవంలో పిల్లలు ఆటపాటలతో సందడి చేయనున్నారు. బాలోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. బాలోత్సవ కమిటీ ఛైర్మన్‌ షమీమ్‌ షఫీవుల్లా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి, కోశాధికారి జిలాన్‌, కమిటీ సభ్యులు గోవిందరాజులు, కోటేశ్వరప్ప, రామాంజినమ్మ, పరమేష్‌, రాజేశ్వరి, శ్యామల, శివ శంకర్‌, తదితరులు హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ షమీమ్‌ షఫీవుల్లా మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆట పాటలకు దూరమై మానసిక ఒత్తిడి లోనవుతూ బాల్యంలో పొందాల్సిన ఆనందాన్ని కోల్పోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో మానసిక ఉల్లాసం, వారిలోని సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్ధేశంతో ఏటా అనంతపురం నగరంలో అనంత బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ‘అనంత బాలోత్సవాల’ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ ఇప్పటికే పూర్తి చేశామన్నారు.

భారతరత్న పివి.నరసింహారావు ప్రాంగణంలో..

          అనంత బాలోత్సవం-4లో భాగంగా ఆర్ట్స్‌ కళాశాల మైదానంకు మాజీ ప్రధాని, భారతరత్న పివి.నరసింహారావు ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ ప్రాంగణంలో స్టేజ్‌-1కు వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న ఎంఎస్‌.స్వామినాథన్‌, స్టేజ్‌-2కి పద్మశ్రీ నాజర్‌, స్టేజ్‌-3కు రచయిత జూపల్లి ప్రేమ్‌ చంద్‌, స్టేజ్‌-4కు అనంత బాలోత్సవం పేర్లను పెట్టారు. ఈ వేదికల్లో మూడు రోజుల పాటు పిల్లలు ప్రదర్శనలు జరగనున్నాయి. 12వ తేదీన ఉదయం 10 గంటలకు బాలోత్సవాలు ప్రారంభం అవుతాయి.

60 రకాల ఈవెట్స్‌లో ప్రదర్శనలు

         బాలోత్సవంలో 60 రకాల ఈవెట్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అకడమిక్‌ ఈవెంట్స్‌లో.. చిత్రలేఖనం, కార్టూన్‌, వ్యాసరచన, కథా విశ్లేషణ, కవితా రచన, కథా రచన, దినపత్రిక పఠనం, మెమొరీ టెస్ట్‌, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌ వంటి అంశాలపై పోటీలు జరుగుతాయి. కల్చరల్‌ ఈవెంట్స్‌లో.. జానపద గీతాలాపన, దేశభక్తి గీతాలాపన, లఘు నాటికలు, విచిత్ర వేషధారణ, ఫ్యాన్సీ డ్రస్‌ వంటి పోటీలు ఉంటాయి.. అకడకమిక్‌, కల్చరల్‌ కలిపి మొత్తం 60 రకాల ఈవెంట్స్‌ ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో జరుగనున్నాయి. రోజుకు సుమారు 3 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 500కు పైగా పాఠశాలలు ఇందులో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి రోజూ జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఏ రోజుకారోజు బహుమతులను అందజేయనున్నారు.

➡️