పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు : కలెక్టర్‌

శిక్షణ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల నియమావళిని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని, ఓటర్లు ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులకు సూఇంచారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎన్నికల ఖర్చులు, వ్యయ పర్యవేక్షణ కమిటీ, వీడియో సర్వేలెన్స్‌ టీం, మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ, అకౌంట్‌ టీం, తదితర సభ్యులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆ తర్వాత పెనుగొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా బృందాలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరూ పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్‌ వేసిన రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నమోదు చేయాలన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లో ఖర్చుల వివరాలను అందించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీ అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలో బహిరంగ సభలు, రోడ్‌షోలు అన్నింటినీ వీడియో సర్వే లెన్స్‌ టీం ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవోలు భాగ్యరేఖ, వంశీకష్ణ, వెంకట శివరామిరెడ్డి. ట్రైనర్‌ సూర్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్లు అంజయ్య, కిరణ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, ఆదాయ పన్ను అధికారులు పాల్గొన్నారు.

➡️