పేదల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు తహశీల్దార్‌ హామీ

పేదలతో మాట్లాడుతున్న తహశీల్దార్‌ అక్బర్‌బాషా, పోలీసు అధికారులు

          గోరంట్ల : మండలంలోని పాలసముద్రం సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలు శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వీరు రాత్రి కూడా అక్కడే నిద్రించారు. వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. వీరికి కెవిపి ఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, సిఐటియు మండల కార్యదర్శి కొండా వెంకటేష్‌ మద్దతు తెలిపారు. పేదలు మాట్లాడుతూ పట్టా కోసం ఇచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో తహశీల్దార్‌ కార్యాలయం లోకి వెళ్లడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా పేదలు అడ్డుకున్నారు. స్పందించిన తహశీల్దార్‌ అక్బర్‌బాషా గుడిసెలు వేసుకున్న వారి రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డులను పరిశీలించి అర్హుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో పేదలు ఆందోళన విరమించారు.

➡️