ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదు

Mar 31,2024 22:57

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట

                 కదిరి టౌన్‌ : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్‌కు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. కందికుంట ఆదివారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జాబ్‌ క్యాలెండర్‌, తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన జగన్‌ ఏ మొఖం పెట్టుకొని ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని నిలదీశారు. పలుమార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని మండిపడ్డారు. ఇసుక, మట్టి, ఖనిజ సంపదను దోచేస్తూ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. రైతులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. హామీలను వంద శాతం అమలు చేశాకే ఓట్లు అడగాలని సూచించారు. ఆయనతో పాటు నాయకులు పవన్‌కుమార్‌ రెడ్డి, ఖాదర్‌ బాషా ఉన్నారు.’కందికుంట’ ఎన్నికల ప్రచారం తలుపుల : మండలంలోని గొల్లపల్లి, రెడ్డిమొల్లపల్లి, గొందిపల్లి, బాలిరెడ్డిగారిపల్లిలో ఆదివారం కదిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో మినీమేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు పివి.పవన్‌ కుమార్‌ రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.

➡️