ప్రభుత్వ కార్యక్రమమా.. వైసీపీ సమావేశమా..?

Feb 8,2024 21:37

వైఎస్‌ఆర్‌ ఆసరా మెగా చెక్కు అందజేస్తున్న ఇన్‌ఛార్జి, తదితరులు

                 కదిరి టౌన్‌ : ప్రభుత్వ పథకాల అమలు స్థానిక ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా కదిరి మున్సిపల్‌ అధికారులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ‘నవ్విపోదురు గాక మాకేంటి’ అన్న చందంగా వైసీపీ నాయకులు, మున్సిపల్‌ అధికారులు చేసిన నిర్వాకం స్థానిక ప్రజా ప్రతినిధిని కించపరిచే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు సంబందించిన వివరాలు… గురువారం స్థానిక పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల సంఘాల సభ్యులకు ఆసరా పథకాన్ని అందజేసే కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా చేపట్టాల్సుంది. అయితే అందుకు భిన్నంగా అధికారులు, వైసిపి నాయకులు వ్యవహరించారు. ప్రజా ప్రతినిధిని కాదని చట్ట సభలలో ఎటువంటి ప్రాతినిధ్యం లేని, ఇటీవల వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన మాక్బుల్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు చేరవేయడంలో ప్రోటోకాల్‌ మేరకు స్థానిక ప్రజాప్రతినిధి ముఖ్య అతిధిగా హాజరై పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు విరుద్దంగా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి చేతుల మీదుగా కాకుండా ఇన్‌ఛార్జి చేతుల మీదుగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుకు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమంలో మక్బుల్‌ అహ్మద్‌ పాల్గొనడంపై మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రజాశక్తి వివరణ కోరగా స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారని అన్నారు. ఇతర వాటిపై ఆయన స్పందించలేదు.

➡️