ప్రయివేటు పాఠశాల బస్సు బోల్తా

బోల్తా పడిన ప్రయివేటు పాఠశాల బస్సు

          పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి మండలం పెడపల్లి సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు గురువారం సాయంత్రం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పెడపల్లికి చెందిన ఉదరుకిరణ్‌ అనే ప్రయివేటు పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్‌ వాహనం గురువారం సాయంత్రం పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులను సొంత గ్రామం బత్తలపల్లికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తూ పెడబల్లి క్రాస్‌ వద్ద అదుపు తప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సుల్లో ఉన్న విద్యార్థులను బయటకు తీసి రక్షించారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడడంతో ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రికి తరలించారు. పరిమితికి మించి వాహనంలో విద్యార్థులను ఎక్కించుకుని వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యంలో ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. పిల్లలందరూ క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు.

➡️