బిల్లులు చెల్లించకుంటే పనులు చేయలేం..!

బిల్లులు చెల్లించాలని కోరుతూ మున్సిపల్‌ ఎంఇ వెంకట రమణకు వినతిని ఇస్తున్న కాంట్రాక్టర్లు

          హిందూపురం : ‘పనులను పూర్తి చేసి నెలలు గడుస్తోంది.. వీటికి సంబంధించి బిల్లుల ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త పనులు చేయాలని చెబుతున్నారు. పాత బిల్లులు ఇస్తేనే కొత్త పనులు చేస్తాం. లేకపోతే మా వల్ల కాదు’ అంటూ గుత్తేదారులు మున్సిపల్‌ అధికారులకు తెగేసి చెప్పారు. హిందూపురం పురపాలక సంఘం వ్యాప్తంగా ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి, పనులకు అగ్రిమెంట్‌ చేసుకున్న కాంట్రాక్టర్లు పనులను త్వరతగితిన పూర్తి చేయించే విషయంపై మంగళవారం నాడు మున్సిపల్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ, డిఈఈ బాలసుబ్రమణ్యంలు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అగ్రిమెంట్‌ చేసుకున్న పనులను ప్రారంభించాలని అధికారులు కోరారు. ఈ సందర్బంగా కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పురపాలక సంఘంలో వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిచేసి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం వివిధ నిబంధనలు తీసుకొచ్చి బిల్లుల మంజూరులో పూర్తి జాప్యం చేస్తోందన్నారు. బిల్లులు రాకపోవడంతో పనులు కోసం చేసిన పెట్టుబడులు కూడా చేతికిరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్‌ పూర్తయిన అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించాడానికి సైతం ఎన్నో నిబంధనలు పెట్టారని, ఆ నిబంధనలు పూర్తిగా పాటించి గడువులోగా పనులను పూర్తి చేశామన్నారు. నిబంధనలతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ ఆడిట్‌ వల్ల పూర్తి చేసిన అభివృద్ధి పనుల బిల్లులను ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి నెలలు పడుతోందన్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కించిన అనంతరం బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 15వ ఆర్థిక సంఘం కింద పూర్తి చేసిన పనులకు సంబందించి రూ.2కోట్లు, మున్సిపల్‌ సాధరణ నిధుల నుంచి మంజూరు చేసిన పనులకు రూ.కోటి, గడప గడపకు మన ప్రభుత్వం కింద పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.కోటి ప్రకారం మొత్తం రూ.4కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పూర్తి చేసి ఆన్‌లైన్‌ చేయని పనులకు సంబంధించి సుమారు రూ.3కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క హిందూపురం పురపాలక సంఘంలోనే దాదాపు రూ.7కోట్ల వరకు పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఇన్ని బిల్లులు పెండింగ్‌లో ఉండి మళ్లీ పనులను చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తేనే తాము అభివృద్ది పనులను ప్రారంభిస్తామన్నారు. పనులు పూర్తయిన వెంటనే చెక్కుల రూపంలో బిల్లులు ఇస్తామనే హామీ ఇస్తే తాము అభివృద్ది పనులు చేస్తామని అధికారులకు తెగేసి చెప్పారు. కాంట్రాక్టర్లు చెప్పిన ఈ విషయంపై ఇంజినీర్లు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజతో చర్చించారు. ఆమె అన్ని సమస్యలను విని ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేరని, ఆయన వచ్చిన అనంతరం ఈ విషయాలపై ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులను త్వరతగితిన మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. అవసరమైతే స్థానిక ఇన్‌ఛార్జి దీపిక దృష్టిికి తీసుకెళ్లి ఆమె ద్వారా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో మాట్లాడుదామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

➡️