భలారే.. బాలోత్సవం..!

బాలోత్సవంలో ప్రదర్శనలు చేస్తున్న పిల్లలు

             అనంతపురం కలెక్టరేట్‌:          అంకెల సంఖ్యల మధ్య నలిగిపోయిన బాల్యానికి ఆటవిడుపు దొరికింది… మార్కుల వేటలో నలిగిపోయిన మెదడుకు కాస్త ఉపశమనం లభించింది… పుస్తకాల మధ్య నలిగిపోయిన సృజనాత్మకత బయటకు వచ్చింది… నాలుగుగోడల మధ్య నలిగిపోతున్న బాల్యపు మధురిమ ప్రపంచానికి తెలిసింది… ఆటపాటలు, నృత్యరూపాలు, కళానైపుణ్యాలు, అద్భుతమైన తెలివితేటల నడుమ చిన్నారులు చేసిన సందడితో అనంత బాలోత్సవ ప్రాంగణం మురిసిపోయింది..! కళాత్మక ప్రదర్శనలతో కనులవిందు చేశారు. సైన్సు ప్రదర్శనలతో అందరినీ ఆలోచింపజేశారు. వ్యాసరచన, వకృత్వ పోటీలతో అబ్బురపరిచారు. వందలాది మంది చిన్నారులు ఒక్క చోట చేరి అనంత పండుగను కనులు ముందు సాక్షాత్కరింపజేశారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానం వేదికగా జరుగుతున్న అనంత బాలోత్సవాలు-4 సోమవారం నాడు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు అనంత బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పిల్లల పండుగలో జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు, చిన్నారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు.

           అనంత బాలోత్సవం-4 పిల్లల పండుగ అనంతపురం నగరంలో సోమవారం నాడు ప్రారంభమైంది. ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో భారతరత్న, మాజీ ప్రధాని పివి.నరసింహారావు ప్రాంగణంలో ఆరు స్టేజ్‌ల్లో కల్చరల్‌ ఈవెంట్స్‌లో చిన్నారులు వారి ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాలలో అకడమిక్‌ విభాగంలో వ్యాసరచన, వకృత్వం తదితర పోటీలు జరిగాయి. మొదటి రోజు పిల్లలు ఆటపాటలతో చిందులేయడమే కాకుండా, తమ విజ్ఞానాన్ని ప్రదర్శించే పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల దుస్తులతో విద్యార్థులు విచిత్ర వేషధారణ కన్పించారు. జానపద పాటలు పాడారు. అల్లూరు సీతారామరాజు, రాణి రుద్రమదేవి, భగత్‌సింగ్‌, సుభాష్‌చంద్రబోస్‌ తది తర వేషధారణతో నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఇలా ఒకటేమిటి వందలాది వేషధారణలో చిన్నారులు ప్రదర్శనలు చేశారు. తమపిల్లల ప్రతిభా పాటావాలను చూసి మురిసిపోయే తల్లులు కొందరు ఆవరణంలో కనిపించగా, తమ పాఠశాల విద్యార్థి మెరుగైన ప్రదర్శన చేయాలని మరికొంత మంది ఉపాధ్యాయులు ఆరాటపడటం అక్కడ కనువిందు చేసిందనే చెప్పాలి. ఆర్ట్స్‌ కళాశాల మైదానం మొత్తం పిల్లల పండుగతో కళకళలాడింది.

ఉత్సాహభరితం..

          బాలోత్సవంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వందకుపైగా పాఠశాలల నుంచి విద్యార్థులు 2000 మంది వరకు పాల్గొన్నారు. రెండు విభాగాల్లో ఆకడమిక్‌, కల్చరల్‌ పోటీల్లో పిల్లలు పాల్గొన్నారు. 64 ఈవెట్స్‌లో విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఒకవైపు అడకమిక్‌, మరోవైపు కల్చరల్‌ పోటీలు మొదటి రోజు జరిగాయి. అడకమిక్‌ పోటీలకు విద్యార్థులు అధికంగా మొదటి రోజు పోటీపడ్డారు. చిత్రలేఖనం, కార్టూన్‌, వ్యాసరచన, కథారచన, దినపత్రిక పఠనం, మెమోరీ టెస్టు, స్పెల్‌ బి, బేస్డ్‌ ఫ్రంవేస్టు, సైన్సు ఎగ్జిబిషన్‌లో అడమిక్‌ పోటీలు ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించారు. కల్చరల్‌ ఈవెంట్స్‌లో జానపద గీతాలాపన, దేశభక్తి గీతాలాపన, లఘునాటికలు, జానపద గీతాలాపన,విచిత్ర వేషధారణ ప్యాన్సీ డ్రెస్‌లు పోటీలు విద్యార్థులు పోటాపోటీగా సాగాయి. మొదటి రోజు పోటీల్లో విజేతలకు సాయంత్రం వేదిక వద్దనే బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ దివాకర్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

శాస్త్రీయ ఆలోచనల వైపు అడుగేద్దాం..

      బాలోత్సవ ప్రారంభ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాలోత్సవ కమిటీ ఛైర్మన్‌ షమీమ్‌ షఫీఉల్లా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాల్యం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డా||గేయానంద్‌, బాలోత్సవ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామరాజు, అనంత బాలోత్సవ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి జిలాన్‌, ఎల్‌కెపి కార్యదర్శి పద్మజ, పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన, ఎల్‌కెపి అధ్యక్షులు ప్రభాకర్‌, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు సేకన్న, రచయిత నబీరసూల్‌ తదితరులు హాజరై వేడుకను ప్రారంభించారు. అంతుకు మునుపు బాలోత్సవ కమిటీ ఛైర్మన్‌ షమీమ్‌ షఫీఉల్లా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు అనంత బాలోత్సవాలు చక్కటి వేదికగా నిలుస్తాయన్నారు. చదువులు, ర్యాంకుల వేటలో బందీ అవుతున్న పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు ఆటవిడుపుగా ఉంటాయన్నారు. పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. పిల్లలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. శాస్త్రీయమైన భారతదేశాన్ని స్థాపించుకోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దివాకర్‌రెడ్డి, అనంత బాలోత్సవ కమిటీ సభ్యులు లింగమయ్య, గోవిందరాజులు, కోటేశ్వరప్ప, నాగేంద్ర, రామాంజినమ్మ, రాజేశ్వరి, శ్యామల, అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️