ముఖ్యమంత్రీ మాటనిలుపుకో..!

పుట్టపర్తి ఆశాల నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

            పుట్టపర్తి రూరల్‌ : పాదయాత్ర సందర్భంగా ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలుపుకోవాలని ఆశా కార్యకర్తలు నినదించారు. ఎన్నికల హామీల అమలు, సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన 36 గంటల వంటా వార్పు నిరసన దీక్షలు శుక్రవారం ముగిశాయి. సిఐటియు ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన దీక్షలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొని ప్రభుత్వానికి నిరసనను తెలియజేశారు. పోలీసుల అడ్డగింతలు, బెదిరింపులను సైతం ఎదర్కొని శిబిరం వద్దనే కూర్చొని నిరసన తెలిపారు. గురువారం రాత్రి తీవ్రమైన చలిలో సైతం ఆశాలు అక్కడే నిద్రించారు. శుక్రవారం దీక్షల ముగింపు సందర్భంగా పలువురు హాజరై మద్దతు తెలిపారు.సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈఎస్‌.వెంకటేష్‌, శ్రామిక మహిళా సంఘం అధ్యక్షురాలు దిల్షాద్‌, జిల్లా ఆశా వర్కర్ల గౌరవాధ్యక్షుడు సాంబయ్య, ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, సౌభాగ్యలు ముగింపు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారాలని ఏళ్ల తరబడి ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం నుంచి చలనం లేదన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆశాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికల హమీలను అమలు చేసి, సమస్యలను పరష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఆశా వర్కర్లు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచాకరం అన్నారు. ఆశాలది న్యాయమైన పోరాటం అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో కలెక్టరేట్ల ముట్టడి, చలో విజయవాడ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖకు అందించారు. ఈసమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలియజేశారు. ఆశల ఆందోళనకు తెలుగుదేశం నాయకులు సామకోటి ఆదినారాయణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్‌ నాయకులు మంజుల, రాధా, వరలక్ష్మి బుక్కపట్నం మంజుల, అనూషతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

➡️