రబీలోనూ వర్షాభావమే..!

ఎండిన వేరుశనగ పంట

ఎండిన వేరుశనగ పంట

          అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో రబీ సీజన్‌లోనూ వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. పంటల సాగు కూడా సాధారణం కంటే 60 శాతం వరకు అనంతపురం, సత్యసాయి జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లాలో రబీలో 1.13 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 80 వేల ఎకరాల్లోనే సాగైంది. సత్యసాయి జిల్లాలో 27 వేల హెక్టార్లకుగనానూ 20 వేల హెక్టార్లే సాగైంది. సాగైన పంట కూడా వర్షాభావంతో పూర్తి స్థాయిలో దిగుబడులు రాలేడు. ప్రదానంగా పప్పుశనగ పంట వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో సాగు అయ్యింది. సాధారణ సాగు 78 వేల హెక్టార్లకు గానూ 48 వేల హెక్టార్లలో అయ్యింది. వర్షాలు సకాలంలో లేకపోవడంతో దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. పంట నూర్పిడి సైతం ఈ పంట నష్టాన్ని ఏ మేరకు అంచనా వేసారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.

రబీ కరువు మండలాలు ప్రకటించేరా..?

        అనంతపురం జిల్లాలో 31 మండలాలకుగానూ 22 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. ఒకవైపు ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 28 మండలాలు కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇక రబీలోనూ వర్షాభావమే నెలకొనడంతో రబీలోనూ కరువు మండలాల ప్రకటన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 461.2 మిల్లీమీటర్లు కురావాల్సి ఉండగా 293.3 మిల్లీమీటర్లు పడింది. ఇక సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 529.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 368.4 మిల్లీమీటర్లు నమోదయ్యింది. 23 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ రబీ పంటల సాగు కూడా నామమాత్రంగానే ఉంటుంది. వేసిన పంటలు కూడా వర్షాల్లేక చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఖరీఫ్‌ సాయమే లేదు… రబీ సాయం ఉండేనా..?

      ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే దాని అంచనాలను రూపొందించారు. అనంతపురం జిల్లాకు రూ.251 పరిహారం అందివ్వాలని అంచనాలను రూపొందించారు. కాని ఇప్పటి వరకు పరిహారం మంజూరుపై ప్రభుత్వం అధికారిక ప్రకటనేది చేయలేదు. ఇక రబీలో పంటల పరిస్థితుల గురించే పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. రైతులు నష్టపోయి సాయం కోసం ప్రభుత్వం వైపు ఎదురు చూసే పరిస్థితులున్నాయి. ప్రభుత్వం ఎన్నికల్లోపు అయినా ఏదైనా ప్రకటన చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

చంద్రశేఖర్‌రెడ్డి ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి.

       ప్రభుత్వం తక్షణం రైతులను ఆదుకోవాలి. రబీలోనూ నష్టం అంచానలను రూపొందించాలి. కరువు మండలాలు ప్రకటించాలి. అదే విధంగా ఖరీఫ్‌ పంట నష్టంకు సంబంధించి పరిహారం అందివ్వాలి. ఎన్నకల్లోపు ప్రకటించాలని కోరుతున్నాం.

➡️