రైతుల భూములు తిరిగి ఇవ్వాలి

Feb 12,2024 22:40

 ఆందోళనలో పాల్గొన్న రైతులు, నాయకులు

                      మడకశిర : ప్రభుత్వం పరిశ్రమల కోసం సెజ్‌ భూములను రైతుల దగ్గర నుంచి తీసుకుని ఇంతవరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని రైతుసంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ మడకశిర మండలం సి కోడిగేపల్లి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటుకు సేకరించిన సేజ్‌ భూముల్లో ఇప్పటివరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఆ భూములు రైతులకు తిరిగి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004లో సెజ్‌ పరిశ్రమల కోసం మడకశిర, పరిగి మండలం లోని పలు ప్రాంతాల్లో రైతుల దగ్గర తీసుకున్నారన్నారు. ఇంతవరకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఐదు సంవత్సరాలలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే రైతుల భూములు రైతులకు వెనక్కు ఇవ్వాలన్నారు. ఈసమస్యపై కలెక్టర్‌కు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం కన్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే భూములను రైతులకు స్వాధీనం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం మడకశిర నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్రకైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘం రైతు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, జంగాలపల్లి పెద్దన్న, సిపిఐ తాలూకా ఇన్‌ఛార్జి పవిత్ర, టిడిపి మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ రైతులు పాల్గొన్నారు.

➡️