సమయ పాలన పాటించని సచివాలయ సిబ్బంది

Dec 6,2023 22:45

ఖాళీ కుర్చీలతో సచివాలయం

         గుడిబండ : మండలంలోని కిరికెర గ్రామ సచివాలయ ఉద్యోగులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం సమయ పాలన పాటించలేదు. మధ్యాహ్నం మూడు గంటలకే విధులకు డుమ్మాకొట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సచివాలయంలో దాదాపు 8 మంది అధికారులు విధులు నిర్వర్తిస్తుండగా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు అందరూ విధులకు డుమ్మా కొట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో సచివాలయం ఖాళీ కుర్చీలతో దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కూడా లేడు. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంప్యూటర్‌, ఇతర పరికరాలు, సామాగ్రి కానీ ఎవరైనా దోచుకెళితే పట్టించుకునే వారు లేరు. దీన్ని బట్టి చూస్తే విధుల నిర్వహణలో సిబ్బంది చిత్తశుద్ది ఏమేరకు ఉందో అర్థం అవుతోంది. సచివాలయ పరిధిలో ఉన్న వివిధ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉదయం 9 గంటలకు విధులకు హాజరై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉండాలి. అయితే బుధవారం మాత్రం మధ్యాహ్నం3 గంటలకే మొత్తం సచివాల సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి ఇంటికి వెళ్లారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

➡️