ఇబ్బందుల వెంబడి..!

      అనంతపురం : రెండు నెలల విరామం తర్వాత పాఠశాలు పున:ప్రారంభం కానున్నాయి. గురువారం నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో విద్యార్థులు సెలవులకు టాటా చెప్పి బడి బాట పట్టనున్నారు. రెండు నెలలుగా మూగబోయిన పాఠశాలలు నేటి నుంచి సందడి కన్పించనుంది. 2024-25 కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యాశాఖ అధికారులు విద్యార్థులను పాఠశాలలకు ఆహ్వానిస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలల పున:ప్రారంభానికి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా పాఠశాలల తరగతి గదులనూ సిద్ధం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఓటింగ్‌ కోసం అధికారులు ఉపయోగించుకున్నారు. పోలింగ్‌ కోసం ఉపయోగించుకున్న తరగతి గదులను విద్యార్థులకు అనుగుణంగా అధికారులు సిద్ధం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపే ఏర్పాట్లలో నిమగం అయ్యాయి. గడిచిన ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పనులు జరిపినా ఇంకా చాలా పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య తదితర మౌలిక వసతుల కల్పన పూర్తి స్థాయిలో జరగలేదు. పట్టణ ప్రాంత పాఠశాలల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 5200 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 3850, ప్రయివేటు పాఠశాలలు 1350 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 3.60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. నేడు పాఠశాలలు తెరవనుండడంతో వీరంతా బడులకు వెళ్లనున్నారు.

విద్యాకానుక పంపిణీలో జాప్యం

          ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థులకు విద్యా కానుక కింద పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం తదితర వాటిని ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువదీరింది. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు రోజులు మాత్రమే అయ్యింది. ఈనేపథ్యంలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించడంలో జాప్యం జరిగే అవకాశం కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని వీటిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పుస్తకాలు పాఠశాలలకు చేరాయని, వీలైనంత త్వరగా వీటిని విద్యార్థులకు అందిస్తామని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. విద్యాకానుక కిట్లు ఏ మేరకు పాఠశాలలకు చేరాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. మొత్తం విద్యార్థులకు ఒకే సారి ఇస్తారా.? లేక గతం మాదిరిగానే కొద్దిమంది విద్యార్థులకు అందజేసి, తరువాత ఇంకొందరికి ఇస్తామని చెబుతారా అన్న అన్నది తెలియాల్సి ఉంది. .

నాడు-నేడు పనులు జరిగినా సమస్యలే..!

          ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న నినాదంతో గత వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు పనులను ప్రారంభించింది. వీటి ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా మూడు విడతలుగా ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశారు. నిధుల లేమి, ఇతరత్రా సమస్యలతో నాడు-నేడు పనులు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో శిథిల తరగతి గదులు నేటికీ దర్శనమిస్తున్నాయి. పురపాలక కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో ఒకింత ఈ పనులు జరిగినా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ వేగం కన్పించలేదు. ఈ ఏడాది కూడా పాత తరగతి గదిల్లోనే పాఠాలు బోధించే పరిస్థితి చాలా పాఠశాలల్లో కన్పిస్తోంది. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు ఉన్న పాఠశాలల్లో నీటి సమస్య కారణంగా వాటిని ఉపయోగించే స్థితి లేదు. దీంతో పిల్లలు ఆరు బయటకు వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంత పాఠశాలలకు ప్రహరీలు లేవు.

గందరగోళంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు

          ప్రభుత్వం మారడంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ గందరగోళంగా మారింది. గత ఐదేళ్లుగా వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ జరుగుతుండేది. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీల బాధ్యతలను తెలుగుదేశం మద్దతుదారులు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ వ్యవహారంపై ఘర్షణలు జరుగుతున్నాయి. నేడు పాఠశాలల ప్రారంభం సందర్భంగా పాతవారితోనే మధ్యాహ్న భోజనం చేయించాలా.. లేక ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారితో మధ్యాహ్న భోజనం తయారు చేయించాలన్న అన్న సందిగ్ధంలో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

ప్రయివేటు ఫీజుల మోత

            ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. వివిధ సిలబస్‌ల పేరుతో కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక విద్యార్థి కార్పొరేట్‌ పాఠశాలల్లో ఎల్‌కెజిలో చేర్పించాలంటే పుస్తకాలు, యూనిఫాం, పాఠశాల ఫీజు కలిపి దాదాపు రూ.20 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక 5 నుంచి 10 వరకు చదివే విద్యార్థులు ఉంటే లక్షల్లోనే ఫీజుల భారం తల్లిదండ్రులపై పడుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజుల నియంత్రణ ఉండాల్సి ఉన్నా, అది ఆచరణలో కన్పించడం లేదు. దీనికి తోడు ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో వారి వద్దనే పుస్తకాలు, యూనిఫాం కొనాలన్న నిబంధనతో వాటి మీద కూడా అదనంగా బాదేస్తున్నారు.

➡️