పకడ్బందీగా ఓట్ల లెక్కింపు : కలెక్టర్‌

May 24,2024 21:37

 సమావేశంలో పాల్గొన్న అధికారులు 

                  పుట్టపర్తి అర్బన్‌ : ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, అదరపు రిటర్నింగ్‌ అధికారులతో తొలి విడత అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశల్లో పాటించాల్సిన నిబంధనలను, తీసుకోవలసిన జాగ్రత్తలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, డిఆర్‌ఒకొండయ్య, రిటర్నింగ్‌ అధికారులు భాగ్యరేఖ, వెంకట శివ సాయి రెడ్డి, గౌరీ శంకర్‌, వంశీకృష్ణ, జిల్లాలోని వివిధ మునిసిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తిచేయాలని సొంత నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వద్దని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకోసం సమగ్ర అవగాహన కల్పించుకోవడానికే ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని హిందూపురం పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాలను హిందూపురం సమీపంలో బిట్‌ కళాశాల నందు మడకశిర, పెనుకొండ, కదిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే పార్లమెంట్‌ నియోజకవర్గానికి కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న చేపట్టడం జరుగుతుందన్నారు. లేపాక్షి మండలంలోని చోళ సముద్రం సమీపంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల నందు పుట్టపర్తి అసెంబ్లీ, ధర్మవరం అసెంబ్లీ సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని రాప్తాడు సంబంధించి 21 రౌండ్లు, మడకశిరకు సంబంధించి 19 రౌండ్లు, పుట్టపర్తి కి 18 రౌండ్లు, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు 21 రౌండ్లు కౌంటింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే హిందూపురానికి 19 రౌండ్లు, పెనుకొండకు 19 రౌండ్లు కౌంటింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని అందువల్ల సిబ్బంది ఆరు గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకొని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మరోవైపు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి లెక్కింపు కేంద్రంలోనూ వీడియో రికార్డింగ్‌ కూడా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును ధరించాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేకపోతే లోపలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తొలి విడత లెక్కింపు మలివిడత లెక్కింపు ప్రక్రియలను వివరించారు. కౌంటింగ్‌ హాలులో రిటర్నింగ్‌ అధికారిదే సర్వాధికారమని వారే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోలైన ఓట్లను ప్రత్యేకంగా కౌంటింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నికల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️