అందరి సహకారంతోనే సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ

అధికారులకు ప్రశంసాపత్రాలను అందిస్నున్న ఎస్పీ మాధవరెడ్డి

          పుట్టపర్తి రూరల్‌ : 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్పీ ఎస్‌వి.మాధవ్‌ రెడ్డి తెలియజేశారు. శనివారం నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సెబ్‌ కమిషనర్‌ పంపిన ప్రశంసా పత్రాలను సెబ్‌ అధికారులతో పాటు సిబ్బందికి అందజేశారు. ఎన్నికల సెల్‌ పోలీస్‌ అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి 60 మందికి ప్రశంసా పత్రాలు, రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళికి అనుగుణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ యంత్రాంగం సమిష్టిగా, నిబద్ధతతో విధులు నిర్వహించడం వల్లనే నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికలు, కౌంటింగ్‌ తదితర అన్ని పనులనూ విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. జిల్లాకు కర్నాటక సరిహద్దు ఉండడం వల్ల నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఉంచి విధులు నిర్వహించారని కొనియాడారు. ఎన్నికల సెల్‌ సిబ్బంది కూడా వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు సరైన సమయంలో సమాచారం ఇవ్వగలిగామన్నారు. ఎన్నికల సెల్‌ సిఐ విక్రమ్‌, ఎస్‌బి ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌లు ఈ విధులు పూర్తి స్థాయిలో నిర్వహించారన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మొబైల్‌ యాప్‌ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఘటనలు చోటు చేసుకున్న వెంటనే మొబైల్‌ పార్టీ లు, ప్రత్యేక బలగాలతో ఘటనా స్థలానికి చేరుకునే అల్లర్లను నివారించగలిగారన్నారు. ఈ విధుల్లో జిల్లా అదనపు ఎస్పీ, అడ్మిన్‌, విష్ణు, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగభూషణం, ఈఎస్‌ సుబ్రహ్మణ్యంలు వారి విధులను బాగా నిర్వర్తించారన్నారు. అనంతరం సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగభూషణం, ఈఎస్‌.సుబ్రహ్మణ్యం, ఎలక్షన్‌ సెల్‌ సిఐ విక్రమ్‌, ఎస్‌బి ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ సీఐ,ఎస్‌ఐలు సిబ్బందికి ఎస్పీ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణు, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగభూషణం, ఈఎస్‌ సుబ్రహ్మణ్యం, ఎస్‌బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, సిఐ విక్రమ్‌, ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️