మా భూములను వెనక్కు ఇవ్వండి : నిర్వాసితులు

Apr 15,2024 22:22

 సమావేశంలో మాట్లాడుతున్న రైతులు

                   హిందూపురం : పరిశ్రమలు ఎన్ని ఏర్పాటు చేయడానికి సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అలా చేయని పక్షంలో తమ భూములను వెనక్కి ఇవ్వాలని రైతన్నలు వేడుకొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతన్నలు హనుమంత రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతు పరిశ్రమలు స్థాపిస్తామని అందరికీ ఉపాధి కల్పిస్తామని1982లో ఏపీఐఐసీ వారు తమ ఆధీనంలో ఉన్న సర్వే నంబర్‌ 11-1, 11-2 లోని 18.46 ఎకరాల భూమిని తీసుకున్నారన్నారు. భూమిని సేకరించిన కొత్తలో కండసార చక్కెర పరిశ్రమను స్థాపించి కొన్ని రోజులకే దానిని మూసి వేశారన్నారు. ఆ స్థలంలో ఇతర పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించామన్నారు. ఆ స్థలంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. అదే స్థలాన్ని ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారని వాపోయారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు హిందూపురం సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో చేయకపోవడంతో చిలమత్తూరు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పైన ఇప్పటికే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించామన్నారు. అయినప్పటికీ రియల్‌ మాఫియా వారు వారికి ఉన్న పలుకుబడితో ఆ స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతులు రవీంద్ర రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️