ప్రభుత్వ ఆదాయం (లే)అవుట్‌..!

దుద్దెబండ వద్ద వెలసిన లేఅవుట్‌.

       పెనుకొండ టౌన్‌ : పెనుకొండలో అనధికార లేఅవుట్లు ఇష్టారాజ్యంగా వెలిశాయి. రియల్టర్లు నిబంధనలకు పాతరేస్తూ ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి కొడుతున్నారు. అడిగేవారే లేరా.. అన్నట్లు ప్లాట్లు వేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు తమకేమీ తెలియదనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కంటితుడుపు చర్యలుగా నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

           కియ పరిశ్రమ ఏర్పాటుతో పెనుకొండ మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీన్ని అసరాగా చేసుకుని రియల్టర్లు ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా అహుడా, పంచాయతీల ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్‌ 453.2ఎ,3ఎ,453.3ఎ, 196.4లో దాదాపు 26 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి అమ్మకాలు చేశారు. మండల పరిధిలోని దుద్దెబండ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్‌ 454లో ఏకంగా 50 ఎకరాల్లో అనధికార లేఅవుట్‌లో ప్లాట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. అమ్మవారి పల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కనే మునిమడుగు పొలం సర్వేనెంబర్‌ 452.1ఎ,452.3లో 3.80 ఎకరాల భూమిని గతంలో ఓ కార్పొరేట్‌ కంపెనీ కొనుగోలు చేసింది. అందులో 2.80 ఎకరాల బూమిని రియల్‌ వ్యాపారులకు అమ్మేసింది. ఈ భూమిలో ప్రస్తుతం ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. సెంటు భూమి రూ.10లక్షల నుంచి రూ.12 లక్షల వరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

నిబంధనలు పాటించని రియల్‌ వ్యాపారులు…

            నూతనంగా లేఅవుట్‌ ఏర్పాటు చేయాలంటే ఆహుడా అనుమతి కోసం దరాఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధనలు ప్రకారం అంతర్గత దారులు 40 అడుగులు, ప్రధాన రోడ్డు 60 అడుగులు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు, సామాజిక అవసరాలకు 10 శాతం స్థలాన్ని రిజర్వ్‌ చేయాల్సి ఉంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా భూమి కన్వర్షన్‌ చేసుకునే వ్యక్తి లేఅవుట్‌ ఫీజు, భూమి వినియోగ మార్పిడి, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు, ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. సామాజిక అవసరాలక పదిశాతం ఖాళీ స్థలాన్ని వదలి, దారులు నిర్మించాలి. నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా లే అవుట్లు వేసి అడ్డుగోలుగా విక్రయాలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ, మున్సిపల్‌ ఆదాయాని గండిపడుతోంది.

చర్యలు తీసుకుంటాం..

       పెనుకొండ, పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లును పరిశీలించి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌, పంచాయతీ అధికారులు అన్నారు. అక్రమ లేఅవుట్ల ఏర్పాటు చేసిన వారికి నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకుంటామన్నారు.

➡️