ఈపండ్లు తింటే పడకే…

May 26,2024 21:41

హిందూపురం : హిందూపురం పట్టణంలో ఎటూ చూసినా మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. చూస్తే నోరూరేలా నిగనిగలాడిపోతున్నాయి. అలా అని కొని నోట్లో వేసుకుంటే పుల్లగా, కాస్త వెగటుగా ఉంటున్నాయి. పక్వానికి రాకముందే కాయల్ని కోసి, రసాయనాల వినియోగంతో వాటిని పండ్లుగా మార్చడం వల్ల కలిగే అనర్థానికి నిదర్శనమిది. మామిడి పండ్లు పూర్తిస్థాయిలో పక్వతతో పండితేనే మంచి రుచి ఉంటుందని తెలిసినా, వాటిని ముందుగానే కోసి, రసాయనాలతో పండించడం వల్ల రుచి ఉండదు సరికదా, ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ప్రక్రియ చట్ట ప్రకారం నేరం కూడా. అయినా వ్యాపారులకు ఇవేవీ పట్టవు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అయితే ఈ ఏడాది జిల్లాలో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది ఐదు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి తగ్గింది. స్థానికంగా అమ్మడంతో పాటు ఇక్కడి నుంచి కర్నాటక రాష్ట్రం బెంగళూరు, శ్రీనివాస పుర, బీజాపుర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం హైదరబాదు తదితర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉంది. దీంతో ఎగుమతులు సైతం తగ్గాయి. ఉన్న మామిడిని ఎప్పటిలాగానే పక్వానికి రాక ముందే పంటను కోసేస్తున్నారు. వాటిని ఆకర్షణీయంగా పండించేందుకు నిషేధిత రసాయనాలన్నీ వినియోగిస్తున్నారు. కార్బైడ్‌ దొరకని పక్షంలో పొరుగు దేశాల నుంచి దిగుమతి అయిన పౌడర్లు, రసాయనాలతో మామిడిని మగ్గిస్తున్నారు. దీంతో అమృత ఫలాలు కాస్తా విష ఫలాలుగా మారిపోతున్నాయి. ఈ తరహాలో పండించిన మామిడి పండ్లను తినడం ద్వారా జీర్ణక్రియ, క్యాన్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తు తాయని వైద్య నిపుణులు హెచ్చ రిస్తున్నారు. చాలా మంది రైతులు తమ ఇళ్లలోనే ఒక గదిలో మామిడి కాయలను ఉంచి కార్బైడ్‌, అగర బత్తి పొగ ద్వారా మగ్గిస్తారు. ఈ తరహాలో మామిడి కాయలను పండుగా తయారు చేయడం వల్ల త్వరగా పండు పక్వానికి వచ్చేయడం, తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో అందరూ దీనినే అనుసరిస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. దీనికి కనీసం 3 నెలల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని అనుసరించి అధికారులు తనిఖీలు చేసి పక్వానికి రాక ముందే రసాయనాలతో మామిడిని పండిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికి అధికారులు ఎవరు ఆ మేరకు చర్యలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా రైతులు పండించిన కాయలను పక్వానికి పచ్చినప్పుడే కోతకోయాలి. కోసిన కాయలను వారికి, అననుకూలంగా ఉన్నట్లయితే బోదగడ్డి, వరిగడ్డి లేకర్లుగా వేసి మాగించే విధానాలు పాటిస్తే మంచిది. రైతులకు అనుకూలంగా లేకపోతే కాయలను మగ్గించేందుకు ప్రభుత్వమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు రైఫనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనంతపురం మార్కెట్‌ యార్డులో పండ్లు మగ్గించేందుకు మూడు ఛాంబర్స్‌ ఉన్నాయి కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం, మార్కెట్‌ యార్డులలో ఒక్కోక్కటికిగా నిర్వహిస్తున్నారు ఈ విధానంతో పండ్లను మగ్గిస్తే ప్రజలకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తవు. రైతులు పండించిన ఉద్యాను త్పత్తులు మామిడితో పాటు సపోటా, అరటి, కర్బూజా, పైనాపిల్‌, బొప్పాయి వంటి వాటికి మగ్గించేదుకు ఈ కేంద్రాలను వినియోగిం చుకొనే అవకాశాలున్నాయి. కాయలను కోసినప్పుడే పక్వానికి వచ్చిన సమయంలో కోత కోసుకొనే విధంగా ఆ శాఖ అధికారులు సలహాలు ఇవ్వాలి. ఈ పండ్లుతింటే రోగాలే.. కార్బేడ్స్‌, కార్బాక్సైడ్‌ తదితర రసాయనంతో మగ్గిస్తున్న పండ్లను తింటే క్యాన్సర్‌, మూత్రపిండ, జీర్ణకోశ తదితర వ్యాధుల బారిన పడతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్ని తెలిసినా కంటికి ఇంపుగా కనిపిస్తే చాలా కొనుక్కొని తింటున్నాము. తనిఖీ అధికారులు అడపా దడపా తనిఖీలు చేసి చేతులు దలుపుకుంటునే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది.. ప్రజారోగ్యంతో చలగాటం ఆడుతున్న వ్యాపారుల మీద సరైన చర్యలు తీసుకోకపోవడంలో ఎవరెలా పోతే మాకెంటి, ఏదో కాలం వెల్లబుచ్చుతున్నామన్న చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కేసులు పెడితే వచ్చేలాభం ఏముందన్న ధోరణితో అధికారులు మామూళ్లు పుచ్చుకొని వెళుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. వ్యత్యాసం గుర్తించడం సులువే సహజంగా పండిన మామిడి పండ్లు, రసాయనాలతో మగ్గించిన మామిడి పండ్లను గుర్తించడంలో ఒక సులువైన మార్గం ఉంది. సహజంగా పండిన మామిడి పండును నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. అదే రసాయనాలతో మగ్గించిన పండు అయితే పండు పెద్దది అయినప్పటికీ, బరువుతో ఉన్నా అది నీటిలో తేలుతుందని రైతులు అంటున్నారు. అంతే కాకుండా సహజంగా పండిన మామిడి పండు అయితే దాని బొడ్డు వద్ద వాసన చూస్తే రుచికరమైన వాసన వస్తుంది. అదే రసాయనంతో పండిస్తే అటువంటి సువాసన రాదు. అధికారులు కేసులు పెట్టడం లేదు….. రసాయనాలతో పండ్లను మాగించే వారిపై వ్యవసాయ, ఉద్యానవన శాఖాదికారులు, సీనియర్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు కేసులుపెట్టే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. రసాయనాల ద్వారా పండ్లు మగ్గిస్తే ఏడాది పాటు జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమానా విధించే విదంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. రెవెన్యూ, పోలీసులు సైతం పండ్లను రసాయనంతో మగ్గిస్తే కేసులు పెట్టవచ్చు. అయినప్పటికి ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో, పండ్ల వ్యాపారులపై ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు అందరు కలిసి ఒక్క సారిగ పండ్ల వ్యాపారులపై తనిఖీలు ముమ్మరం చేస్తే పెద్ద మాఫియా బయట పడుతుంది. ధర అధికమే మార్కెట్‌లో మామిడి పండ్ల ధర కాస్త అధికంగానే ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా లభించే బేనిష మామిడిపళ్లు కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. మల్లిక మామిడిపళ్లు కిలో రూ.100, మలగూబ కిలో రూ.120 నుంచి 150 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రసపూరి మామిడిపళ్లు కిలో రూ. 110 నుంచి 130 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇతర జాతుల పండ్లు రూ.80 వరకు అమ్ముతున్నారు.రసాయనాలతో మగ్గిస్తే దుష్పరిణామాలు ప్రస్తుతం మార్కెట్లో నిగనిగలాడుతూ కనిపిస్తున్న మామిడి పండ్లు అన్ని పక్వానికి వచ్చి మగ్గినవి కాదు. పలు రకాల రసాయనాలు కలిపి మగ్గ బెడుతున్నారు. వీటివల్ల అనేక రకాలైన సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్టిక్‌, చర్మ సమస్యలు, ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిపోవడం, నరాలకు సంబంధించిన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. అదే పనిగా రసాయనాలతో మగ్గపెట్టిన మామిడి పండ్లను అధికంగా తింటే క్యాన్సర్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు వస్తాయి. రసాయనాలతో మగ్గపెట్టిన మామిడి పండ్లను తినకపోవడం చాలా మంచిది.డాక్టర్‌ వెంకట రమణ నాయక్‌ ఫిజిషియన్‌, జిల్లా ప్రభుత్వ అసుపత్రిహిందూపురం

➡️