మూడింతలు అధికంగా వాన..!

అనంతపురం ప్రతినిధి : గతేడాది మొత్తం తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. అటు అనంతపురం, ఇటు సత్యసాయి జిల్లాలో రెండు చోట్ల జూన్‌ ప్రారంభం నుంచే అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఏదోక చోట వర్షపాతం నమోదవుతేనే ఉంది. సాధారణం కంటే అనంతపురం జిల్లాలో మూడింతలు అధికంగా వర్షపాతం నమోదవగా, సత్యసాయి జిల్లాల రెండింతలు అధికంగా వర్షపాతం నమోదయింది. సీజన్‌ ప్రారంభంలోనే వస్తున్న వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

305.3 శాతం అధికం

    అనంతపురం జిల్లాలో 31 మండలాల్లో పడిన వర్షపాతం సాధారణం కంటే 305.3 శాతం అధికంగ పడింది. ఈ జిల్లాలో జూన్‌, జులై రెండు మాసాల్లో పడేంత వర్షపాతం ఈ నెలలో ఇప్పటికే పడింది. జూన్‌, జులై నెలలు కలిపి అనంతపురం జిల్లాల సాధారణ వర్షపాతం 124.9 మిల్లీమీటర్లు అయితే ఇప్పటికే అనంతపురం జిల్లాలో 137 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. మండాల వారీగా చూస్తే అత్యధికంగా కూడేరు మండలంలో 934.5 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది. ఇక్కడ ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 15.8 మిల్లీమీటర్లు అయితే 163.4 మిల్లీమీటర్లు వానపడింది. బెళుగుప్పలో 646.7 శాతం అధికంగా నమోదయింది. ఇక్కడ సాధారణ వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు అవుతే 227 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. వజ్రకరూరులో 625 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది. ఈ మండలంలో సాధారణ వర్షపాతం 29.3 మిల్లీమీటర్లు అయితే 212.6 మిల్లీమీటర్లు నమోదయింది. ఇలా 32 మండలాల్లోనూ సాధారణం కంటే వర్షపాతం అధికంగా నమోవడం గమనార్హం. జిల్లా మొత్తంగా చూసినప్పుడు ఇప్పటి వరకు 33.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 137 మిల్లీమీటర్లు నమోదయింది. అంటే సాధారణం కంటే 305.3 శాతం అధికంగా పడింది.

సత్యసాయిలో 201.6 శాతం అధికం

      సత్యసాయి జిల్లాలోనూ వర్షపాతం సాధారణం కంటే 201.6 శాతం అధికంగా పడింది. ఇక్కడ 32 మండలాలకుగానూ 30 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. తక్కిన మండలాల్లోనూ మంచి వర్షపాతమే నమోదైంది. సత్యసాజిల్లాలో సాధారణ వర్షపాతం 36.6 మిల్లీమీటర్లు కాగా పడింది 110.4 మిల్లీమీటర్లు నమోదయింది. సాధారణం కంటే 201.6 శాతం అధికంగా పడింది. సత్యసాయి జిల్లాలో బత్తలపల్లిలో అత్యధికంగా 592 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది. 33.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగానూ 230.6 మిల్లీమీటర్లు నమోదయింది. అగళి మండలంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయింది. ఈ మండలంలో సాధారణ వర్షపాతం 44.9 మిల్లీమీటర్లుకాగా పడిన వర్షపాతం 50.2 మిల్లీమీటర్లు. 11 శాతం మాత్రమే అధికంగా పడింది. తక్కిన అన్ని మండలాల్లోనూ సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయింది.

➡️